Begin typing your search above and press return to search.

అమరావతి సభ పై సీపీఎం మడత పేచీ.. గైర్హాజరు

By:  Tupaki Desk   |   17 Dec 2021 11:36 AM GMT
అమరావతి సభ పై సీపీఎం మడత పేచీ.. గైర్హాజరు
X
న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటూ 450 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి.. తిరుపతి చేరుకుని భారీ బహిరంగ సభ తలపెట్టిన అమరావతి రైతులకు సీపీఎం షాకిచ్చింది. పార్టీ విధాన నిర్ణయమే అయినా.. ఓ కీలక అంశంపై సీపీఎం వైఖరి కొందరికి ఆగ్రహం కలిగించింది. మరికొందరిని నిరాశకు గురిచేసింది. తిరుపతిలో రైతుల సభకు రాలేమని అమరావతి జేఏసీకి సీపీఎం లేఖ రాసింది.

ఈ భారీ బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజుతో పాటు బీజేపీ నాయకులూ హాజరవుతున్నారు. వాస్తవాని సభకు హాజరుకావాలంటూ అన్ని పార్టీల అధ్యక్షులకు అమరావతి జేఏసీ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. అయితే తామ రాలేమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ రాశారు. తమను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

రాలేనిది అందుకేనేట...?

అమరావతి రైతుల సభకు ఎందుకు రాలేకపోతున్నామో సీపీఎం మధు తన లేఖలో వివరించారు. అమరావతి నిర్మాణానికి, రాష్ట్రాభివృద్ధికి అడ్డుగా ఉన్నది బీజేపీ అని.. అమరావతి జేఏసీ బహిరంగ సభలో ఆ పార్టీతో వేదికను పంచుకోలేమని మధు వ్యాఖ్యానించారు. సభకు రాలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.

రాజధానిని ముక్కలు చేయాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి చాలా నష్టం చేస్తుందని మధు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని అన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలనేది సీపీఎం వైఖరి అని మధు తేల్చి చెప్పారు.

విధాన నిర్ణయమే అయినా.. సరైన సందర్భమేనా?

జగన్ సర్కారు మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా.. అమరావతి ప్రాంత రైతులు, మహిళలు పోరాటం బహిరంగ సభ రూపంలో చివరకు వచ్చింది. దాదాపు రెండేళ్లుగా వీరి పోరాటం సాగింది. ధర్నాలు, నిరసనలు, నిర్బంధాలు ఇలా ఎన్నో పరిణామాలు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని.అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే న్యాయస్థానం నుంచి దేవస్థానం మహా పాదయాత్రను నిర్వహించారు.

నవంబరు 1వ తేదీన మహా పాదయాత్రను ప్రారంభించారు. 45 రోజుల పాటు తుళ్లూరు నుంచి తిరుపతి వరకు కొనసాగింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా సాగింది. రైతుల పాదయాత్రకు జనసేన, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ.. పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇంత జరిగినా.. బీజేపీ బూచి చూపి బహిరంగ సభకు సీపీఎం దూరంగా ఉంది. అయితే, ఆ పార్టీ విధాన నిర్ణయమే అయినా ఇందుకు సమయం ఇది కాదని అంటున్నారు.