Begin typing your search above and press return to search.

డియర్ కామ్రేడ్స్.. వాళ్ల చెంతకే..

By:  Tupaki Desk   |   26 July 2019 9:45 AM GMT
డియర్ కామ్రేడ్స్.. వాళ్ల చెంతకే..
X
స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ తో ధీటుగా పోరాడిన వారు కామ్రేడ్స్. కమ్యూనిస్టుల పోరాట పటిమకు అధికారం కూడా సొంతమైంది. ఇప్పటికే పశ్చిమబెంగాల్- కేరళలో కమ్యూనిస్టులు బలమైన శక్తులుగా ఉన్నారు. 90వ దశకానికి ముందు కూడా కమ్యూనిస్టులు తెలుగు రాష్ట్రాల్లో బలమైన ముద్ర వేసేవారు.. రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగానూ గెలిచారు.

కానీ 2019 ఎన్నికలు కామ్రేడ్స్ కు పీడకలను మిగిల్చాయి. ఏపీలో- తెలంగాణలో ఎవ్వరూ గెలవలేదు. ఉన్నవాళ్లంతా టీఆర్ ఎస్- కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు కమ్యూనిస్టుల ఉనికే ప్రశ్నార్థకమైంది.

అయితే 2014 నుంచే కమ్యూనిస్టులు రాష్ట్రంలో కొత్త ఒరవడితో ముందుకెళ్లారు. ముఖ్యంగా సీపీఎంను పక్కనపెట్టి బీఎల్ ఎఫ్- టీమాస్ సంఘాలుగా ఏర్పడ్డారు. వీటితోనే తెలంగాణ, ఏపీలో పోటీచేశారు. బీఎల్ ఎఫ్ ఒక్క మిర్యాలగూడలో తప్పితే రాష్ట్రంలో ఎక్కడా 1500 మించి ఓట్లను రాబట్టుకోలేదు. సీపీఎం గుర్తును పక్కనపెట్టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎల్ ఎఫ్, టీమాస్ లుగా పోటీచేయడం సీపీఎం చరిత్రలో ఒక విఫలప్రయోగాలుగా మిగిలింది. అందుకే ఇక ఆ రెండు సంఘాలను పునరుద్దరించకూడదని కామ్రేడ్స్ సిద్ధమయ్యారట. మునుపటి మాదిరిగానే వర్గ పోరాటాలను చేయాలని డిసైడ్ అయ్యారట..

ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి నడవాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నిర్ణయించారు. తమ భవిష్యత్ పొత్తు అంతా కాంగ్రెస్ తోనే అని స్పష్టం చేశారు. దీంతో కామ్రేడ్స్ అడుగులు కాంగ్రెస్ తోనే అని డిసైడ్ అయిపోయింది. మరి కాంగ్రెస్ తోనైనా కమ్యూనిస్టులకు కొన్ని సీట్లు వస్తాయో లేవో చూడాలి మరీ..