Begin typing your search above and press return to search.

చంద్రబాబు వస్తే వామపక్షాలకు బలం!

By:  Tupaki Desk   |   17 March 2015 5:30 PM GMT
చంద్రబాబు వస్తే వామపక్షాలకు బలం!
X
చంద్రబాబు నాయడు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఒక విచిత్రం జరుగుతుంది. అది ఏమిటంటే, వామపక్షాలు బలోపేతం కావడం! ఇది ఇప్పటి నుంచి కాదు.. గత రెండు దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. ఇప్పుడు మరోసారి ఇదే నిజమైంది.

తెలుగు రాష్ట్రాల్లో వామపక్షాలు అంటే సీపీఐ, సీపీఎం దాదాపు కనుమరుగు అయ్యే పరిస్థితి. తెలంగాణలో పరిస్థితి ఎలా ఉన్నా.. ఏపీలో అయితే వాటి ఉనికి కనుమరుగు అయింది. దాంతో మళ్లీ బలం పుంజుకోవాలని ఇటీవల సీపీఎం సమావేశాల్లో నిర్ణయించారు. మళ్లీ బలోపేతం కావడంలో భాగంగా వామపక్ష నేతలు రెండు నెలల కిందట రాజధాని ప్రాంతానికి వెళ్లారు. అక్కడికి వెళ్లి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. దాంతో అక్కడి రైతులు తిరగబడ్డారు. దాంతో అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఈ పరిస్థితుల్లోనే ఏపీలో మళ్లీ బలోపేతం కావాలంటే ఏం చేయాలనే తీవ్ర మథనంలో ఉన్నారు. వెదుకుతున్న తీగ కాలికి తగిలినట్లు ఇప్పుడు వారికి అవకాశం పండులా దొరికింది.

అంగన్‌వాడీలకు కేసీఆర్‌ జీతాలు పెంచారు. హామీ ఇచ్చి కూడా చంద్రబాబు జీతాలు పెంచలేదు. అంగన్‌వాడీలు ఆందోళన చేస్తున్నారు. వారు ఎలాగూ తమ పార్టీ సానుభూతిపరులు ఉంటారు. వారి ఆందోళనను సొంతం చేసుకుంటే బలోపేతం కావచ్చు. సరిగ్గా ఇదే ఆలోచనతో అంగన్‌వాడీలను హైదరాబాద్‌ తీసుకొచ్చారు ఐద్వా నాయకులు. వారికి సీపీఎం మద్దతు ఇచ్చింది. ఇంకేముంది.. కొన్నేళ్ల తర్వాత మళ్లీ సీపీఎం పెద్దఎత్తున ప్రజా ఉద్యమం చేస్తోంది. రాష్ట్రంలో బలోపేతం కావడానికి దానికి మరో అవకాశం దక్కింది. ఇటువంటి మరో రెండు మూడు ఉద్యమాలు చేస్తే 2019 ఎన్నికల్లో కనీసం ఒకటయినా ఎమ్మెల్యే సీటు గెలవకపోతామా అన్నది వారి ఉద్దేశం. ఉద్యమిస్తే మంచిదే కానీ చెడు ఎందుకు జరుగుతుంది.