Begin typing your search above and press return to search.

జగన్ ఏడాది పాలనపై తాజా సర్వే ఏం చెబుతోంది?

By:  Tupaki Desk   |   22 Jun 2020 4:45 AM GMT
జగన్ ఏడాది పాలనపై తాజా సర్వే ఏం చెబుతోంది?
X
గత ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఆయన ఏడాది పాలనపై రాజకీయ వర్గాలు ఒక్కొక్కరు ఒక్కోలా వ్యాఖ్యానించటం తెలిసిందే. ఇదేం కొత్త విషయం కాకున్నా.. రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? వారి మనసులోని మాట ఏమిటి? అన్నది మాత్రం ఆసక్తికరం. ఇదే విషయాన్ని తెలుసుకునేందుకు సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ సంస్థ (సీసీఎస్) తాజాగా ఒక సర్వేను నిర్వహించింది.

ఏపీలోని 13 జిల్లాల్లోని 44 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వేను నిర్వహించింది. తాజాగా అందుకు సంబంధించిన ఫలితాల్ని వెల్లడించింది. జగన్ ఏడాది పాలనకు ప్రజాదరణ పెరిగిన విషయాన్ని స్పష్టం చేయటమే కాదు.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఆ పార్టీ భారీ మెజార్టీతో ఆఖండ విజయాన్ని సాధించటం ఖాయమని తేలింది. ముఖ్యమంత్రి చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి చక్కటి మద్దతు లభిస్తోందన్న మాట తాజా సర్వే ఫలితం స్పష్టం చేస్తోంది.

జూన్ 2 నుంచి 8 మధ్య కాలంలో చేపట్టిన సర్వే ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి. ఇందులో 2881 మంది తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. సర్వే చేసిన దానిలో గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు 55.2 శాతం ఉంటే. పట్టణ ప్రాంతానికి చెందిన వారు 44.8 శాతం ఉన్నారు. తాజా సర్వే ప్రకారం 55.8 శాతం మంది ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటుండగా.. 38.3 శాతం మంది తెలుగుదేశం పార్టీ పవర్లోకి రావాలని కోరుతున్నారు. అదే సమయంలో ఏపీలో తమ ఉనికిని చాటుకోవటం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ.. జనసేనలకు 5.3 శాతం చొప్పున ప్రజల నుంచి మద్దతు ఉందన్న విషయాన్ని సర్వే ఫలితం తేల్చింది.

మాయదారి రోగాన్ని కట్టడి చేసే విషయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు బాగున్నట్లు 75.8 శాతం మంది కితాబు ఇవ్వగా.. ఎన్నికల సందర్భంగా జగన్ ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్నట్లుగా 63.9 శాతం మంది పేర్కొన్నారు. అందుకు భిన్నం గా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వారు 35 శాతం ఉన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ అత్యధిక శాతం మంది హామీలు అమలవుతున్నట్లు గా పేర్కొన్నారు.

దీనికి భిన్నంగా ప్రతిపక్షాలు మాత్రం జగన్ ఏడాది పాలనపై విమర్శలు చేస్తుండటం గమనార్హం. ముఖ్యమంత్రి గా జగన్ పని తీరు బాగుందని 62.6 శాతం అభిప్రాయపడితే.. 36.1 శాతం మంది మాత్రం బాగోలేదన్న మాటను చెప్పినట్లుగా సదరు సంస్థ వెల్లడించింది. మొత్తంగా చూస్తే.. జగన్ ఏడాది పాలన పై ప్రజా స్పందన బాగున్నట్లు కనిపిస్తున్నా.. ఎన్నికల్లో సొంతం చేసుకున్న సీట్ల తో పోల్చినప్పడు మాత్రం ఆయనకున్న ఆదరణ కాస్త తక్కువైందన్న భావన కలుగక మానదు.