Begin typing your search above and press return to search.

'మహా' కూటమికి అప్పుడే బీటలా ..ఏంజరుగుతోంది ?

By:  Tupaki Desk   |   5 Dec 2019 1:07 PM GMT
మహా కూటమికి అప్పుడే బీటలా ..ఏంజరుగుతోంది ?
X
దాదాపుగా నెల రోజుల రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ .. మహారాష్ట్ర లో శివసేన - కాంగ్రెస్ - ఎన్సీపీ లతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మహా వికాస్ ఆగాఢీ పేరుతొ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ..శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే సీఎం గా ప్రమాణస్వీకారం చేసారు. ఈ మూడు పార్టీల సిద్ధాంతాలు ఒక్కటి కాకపోయినా, అందరూ ఒక్కతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ..సంచలనం సృష్టించారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే వారి మధ్య బేధాభిప్రాయాలు వచ్చినట్టు సమాచారం. హిందూ భావజాల సంస్థ అయిన ‘సనాతన్ సంస్థ’ అనే సంస్థపై నిషేధం విధించాలని కాంగ్రెస్ ఎంపీ హుస్సేన్ దల్వాయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ తో శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ తీవ్రంగా విభేదించినట్లు తెలుస్తోంది.

ఒక మీడియా సమావేశంలో దల్వాయ్ మాట్లాడుతూ... ప్రముఖ హేతువాది అయిన నరేంద్ర దబోల్కర్‌ ను హత్య చేసిన ‘సనాతన్ సంస్థ’ అనే సంస్థపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. శివసేన ఇప్పటి వరకైతే సనాతన్ సంస్థకు మద్దతు ప్రకటించలేదు. ఒకవేళ మహారాష్ట్ర అభివృద్ధిలో దూసుకుపోవాలనుకుంటే కొందరిపై నిఘా ఉంచాల్సిందే. అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఏఏ చర్యలు చేపట్టాలో చేపడతామని ఇప్పటికే సీఎం ఉద్ధవ్ ప్రకటించారు. అందుకు దబోల్కర్ హత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా మహా వికాస్ అగాఢీలో భాగస్వామి అయిన ఎన్సీపీపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్సీపీకి చెందిన మంత్రి జయంత్ పాటిల్ సామాజిక కార్యకర్త భిడేను రక్షించాలని చూస్తున్నారని ఆరోపించారు.

భిడేకు మద్దతివ్వొద్దని జయంత్ పాటిల్‌ ను కోరుతున్నానని, వారికి తగిన గుణపాఠం నేర్పించాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. అలాంటి కేసుల్లో సంస్థలను నిషేధిస్తే ఎలాంటి ప్రయోజనమూ చేకూరదని పలు సందర్భాల్లో నిరూపితమైందని స్పష్టం చేశారు. రౌత్‌ తో పాటు మంత్రి జయంత్ పాటిల్ కూడా స్పందించారు. బీమా కోరేగావ్ అల్లర్లకు కారణమైన వారినెవ్వరినీ ప్రభుత్వం వెనకేసుకురావడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి పట్టుమని నెల రోజులు కూడా గడవకముందే.. మహా వికాస్ ఆగాఢీ లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండటం తో అప్పుడే ఆగాఢీ కోట కి బీటలు పడ్డాయా అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.