Begin typing your search above and press return to search.

తాజాగా అక్ర‌మ నిర్మాణాల నోటీసులు అందింది వీరికే!

By:  Tupaki Desk   |   30 Jun 2019 4:47 AM GMT
తాజాగా అక్ర‌మ నిర్మాణాల నోటీసులు అందింది వీరికే!
X
కృష్ణా క‌ర‌క‌ట్ట‌పై నిర్మించిన అక్ర‌మ నిర్మాణాల‌పై ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్ర‌మ నిర్మాణాల‌ను అస్స‌లు వ‌ద‌లొద్ద‌ని స్ప‌ష్టం చేశారు. ఎంత‌టి వారినైనా స‌రే చ‌ర్య‌లు త‌ప్ప‌నిస‌రి అంటూ క్లియ‌ర్ గా తేల్చేసేసిన వేళ‌.. అందుకు త‌గ్గ‌ట్లే ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గ‌త ప్ర‌భుత్వం రూ.8కోట్ల‌తో నిర్మించిన ప్ర‌జావేదిక అక్ర‌మ‌మ‌ని తేల్చిన నేప‌థ్యంలో కూల్చేసిన వైనం తెలిసిందే.

తాజాగా ఇదే త‌ర‌హాలో ఉన్న నిర్మాణాలను గుర్తించిన అధికారులు నోటీసులు ఇస్తున్నారు. ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అద్దెకు ఉంటున్న నివాసానికి నోటీసులు ఇవ్వ‌టంపై ప‌లువురు త‌ప్పు ప‌ట్ట‌టం.. విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టేలా రాజ‌కీయాల్ని తెర మీద‌కు తేవటం తెలిసిందే.

అయితే.. త‌ప్పు చేసినోళ్లు ఎవ‌రైనా.. ప్ర‌భుత్వ స్పంద‌న ఒకేలా ఉంటుంద‌న్న విష‌యాన్ని తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో జ‌గ‌న్ స‌ర్కారు ఫ్రూవ్ చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాజాగా మ‌రో ప‌ది అక్ర‌మ నిర్మాణాల‌కు నోటీసులు ఇచ్చిన సీఆర్డీఏ అధికారులు.. రానున్న రోజుల్లో మ‌రో 20 నిర్మాణాల‌కు సైతం నోటీసులు ఇస్తార‌ని చెబుతున్నారు.

ప్ర‌కాశం బ్యారేజీ మొద‌లు తాళ్లాయ‌పాలెం వ‌ర‌కు ఉన్న ప‌లు నిర్మాణాల‌కు తాజాగా నోటీసులు ఇచ్చారు.

నోటీసులు అందుకున్న వాటిల్లో ఆశ్ర‌మాలు.. ఆధ్యాత్మిక ప్ర‌దేశాలు.. అతిథి గృహాలు ఉన్నాయి. అధికారుల నోటీసులు అందుకున్న పెద్దోళ్ల‌లో బీజేపీ మాజీ ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు గెస్ట్ హౌస్.. పాతూరు సుధారాణి గెస్ట్ హౌస్.. చంద‌న గెస్ట్ హౌస్.. తుల‌సి గార్డెన్స్.. తాళ్లాయ‌పాలెంలో శివ‌స్వామి ఆశ్ర‌మం.. వెంక‌ట‌పాలెంలో మ‌రిన్ని నిర్మాణాల‌కు నోటీసులు ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

మొత్తంగా 50కు పైగా నిర్మాణాల్ని అక్ర‌మంగా తేల్చి అధికారులు.. మిగిలిన వాటికి నోటీసులు ఇచ్చే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. నోటీసులు జారీ చేసే క్ర‌మంలో అధికారులు హ‌డావుడి చేయ‌ట్లేదు. ప్ర‌భుత్వ విధానం ఎవ‌రికైనా ఒకేలా ఉంటుంద‌ని.. రాజ‌కీయ కోణం కంటే.. అక్ర‌మాల‌ను ప్ర‌భుత్వం ప్రోత్స‌హించ‌ద‌న్న సంకేతాన్ని బ‌లంగా ఇవ్వాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం కోరుకుంటుంద‌న్న మాట వినిపిస్తోంది.