Begin typing your search above and press return to search.

అచ్చం మీలా ఉండే వ్యక్తి ని సృష్టించవచ్చని మీకు తెలుసా..?

By:  Tupaki Desk   |   17 Jun 2022 2:30 AM GMT
అచ్చం మీలా ఉండే వ్యక్తి ని సృష్టించవచ్చని మీకు తెలుసా..?
X
అచ్చం నీలా ఉన్న అమ్మాయిని ఇవాళ బస్టాప్‌లో చూశానని మన ఫ్రెండ్‌ ఎవరైనా మనతో చెబితే అవునా అని ఆశ్చర్యపోతాం. ఈ సృష్టిలో మనుషులని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనే విషయాన్ని గుర్తు చేస్తుంటాం. కానీ నిజంగా మనల్ని పోలిన మనుషులను సృష్టించుకునే అవకాశముంటే..? ఈ ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? అచ్చం మీలా కనిపించే వ్యక్తిని సృష్టించుకోవచ్చనే విషయం మీకు తెలుసా..? అదెలా సాధ్యం అంటారా.. ఈ స్టోరీ చదివేయండి మీకే తెలుస్తుంది..?

నేటి యుగమంతా టెక్నాలజీ పైనే నడుస్తోంది. మనుషులు చేసే ప్రతి పనికి మెషీన్లను వాడుకునే సౌలభ్యం ఉంది. అలాగే ఆధునిక సాంకేతికతతో ఎన్నో వినూత్న ఆవిష్కరణలూ వస్తున్నాయి. అయితే ఎప్పుడైనా అచ్చం మీలా కనిపించే డిజిటల్ ట్విన్‌ను సృష్టిస్తే ఎలా ఉంటుందనే విషయం గురించి ఆలోచించారా..? డిజిటల్ ప్రపంచంలో మీలాంటి వ్యక్తి సంచరిస్తుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనే భలే గమ్మత్తుగా ఉంది కదూ. మెటావర్స్ లాంటి డిజిటల్ ప్రపంచంలో మనల్ని పోలిన వ్యక్తుల్ని సృష్టించడం పై కొత్త ట్రెండ్ నడుస్తోంది.

వాస్తవ ప్రపంచంలో ఉండే వాళ్లకి ప్రత్యేక సేవలు అందించేందుకు లేదా పరికరాలను మెరుగు పరిచేందుకు ఈ డిజిటల్ ట్విన్‌లు ఉపయోగపడతాయి. మొదట్లో ఇవి 3డీ కంప్యూటర్ మోడల్స్‌కు మాత్రమే పరిమితమై ఉండేవి. అయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు ఇంటర్నెట్‌ ఆఫ్ థింగ్స్ తోడు కావడంతో నిరంతరం కొత్త అంశాలు నేర్చుకుంటూ మెరుగయ్యే డిజిటల్ ట్విన్‌లకు మార్గం సుగమమైంది. ఈ దశాబ్దం చివరినాటికి మనుషుల డిజిటల్ ట్విన్‌ల తొలి వెర్షన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టెక్నాలజీ విశ్లేషకుడు రాబ్ ఎండెర్లీ చెప్పారు.

''దీని కోసం చాలా మేధస్సు పెట్టాల్సి ఉంటుంది. నైతిక అంశాలనూ పరిగణలోకి తీసుకోవాలి. ఇలాంటి డిజిటల్ ట్విన్‌లతో ఉద్యోగాలిచ్చే సంస్థలకు చాలా ఉపయోగం ఉంటుంది. మీ కంపెనీ మీలాంటి డిజిటల్ ట్విన్ తయారు చేస్తే ఏమవుతుంది? దానికి జీతం ఇవ్వాల్సిన పనిలేదు. అప్పుడు మీతో ఆ ఉద్యోగం చేయించాల్సిన అవసరం ఉంటుందా? ఈ డిజిటల్ ట్విన్స్ ఎవరి ఆధీనంలో ఉంటాయనే ప్రశ్న మెటావర్స్ వరల్డ్‌లో కీలకంగా మారనుంది. వ్యక్తులను పోలిన డిజిటల్ వ్యక్తులను సృష్టించే సాంకేతికతపై ఇప్పటికే పనులు మొదలయ్యాయి. అయితే, ఇవి ఇప్పుడు మరీ ప్రాథమిక దశలో లేవు మరోవైపు పూర్తిగానూ సిద్ధమయ్యాయని కూడా చెప్పలేం." అని రాబ్ ఎండెర్లీ తెలిపారు.

ఫార్ములా వన్ రేసింగ్‌లో మెక్‌లారెన్, రెడ్ బుల్ టీమ్‌లు ఇప్పటికే డిజిటల్ ట్విన్‌లను ప్రవేశపెట్టాయి. మరోవైపు డెలివరీ ఏజెంట్ డీహెచ్‌ఎల్ కూడా తమ వేర్‌హౌస్‌లు, సప్లై చెయిన్‌ల డిజిటల్ వెర్షన్‌లను రూపొందిస్తోంది. మన నగరాలను పోలిన డిజిటల్ నగరాలు కూడా తయారవుతున్నాయి. షాంఘై, సింగపూర్‌లకు ఇప్పటికే డిజిటల్ ట్విన్‌లు ఉన్నాయి. ముఖ్యంగా డిజైన్, బిల్డింగ్స్ ఆపరేషన్స్, ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ తదితర అంశాల్లో మెరుగైన వ్యూహాలకు వీటిని ఉపయోగిస్తున్నారు.

సింగపూర్‌లో అయితే, రద్దీగా ఉండే వీధుల్లోకి మరింత మంది వెళ్లకుండా లేదా కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ డిజిటల్ ట్విన్ సేవలను ఉపయోగిస్తున్నారు. మరోవైపు భూగర్భ మార్గాల్లో మౌలిక సదుపాయాల కల్పనకూ ఇది ఉపయోగపడుతుంది. పశ్చిమాసియాలోని కొన్ని నగరాలనూ ఇలా డిజిటల్ రూపంలో సృష్టించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి.

ఆరోగ్య రంగంలో ఈ పరిజ్ఞానం మరింత ఎక్కువగా ఉపయోగపడే అవకాశముంది. మనిషి గుండెను పోలిన ఒక ప్రోటోటైప్‌ను తయారుచేశామని డసో వెల్లడించింది. గుండె శస్త్రచికిత్సల్లో వైద్యులకు ఇది చాలా ఉపయోగపడే అవకాశముంది. ''డిజిటల్ హార్ట్‌ను తయారుచేయడం వల్ల కొత్త ఔషధాలు, వైద్య పరికరాలను జంతువులపై ప్రయోగించాల్సిన అవసరం తప్పుతుంది.

సైంటిఫిక్ రీసెర్చ్‌లో జంతువులపై ఇలా పరీక్షలు చేయడంపై మొదట్నుంచీ చాలా వివాదాలు ఉన్నాయి. ఏదో ఒక సమయంలో మనల్ని పోలిన పూర్తి డిజిటల్ ట్విన్ తయారు అయిపోతుంది. అప్పుడు వ్యాధులు రాకముందే మనం వాటిని పసిగట్టవచ్చు. చికిత్సలు కూడా మనకు తగినట్లుగా అభివృద్ధి చేయొచ్చు'' అని డసో సిస్టమ్స్‌లోని గ్లోబల్ అఫైర్స్ డైరెక్టర్ సెవెరీన్ ట్రౌలిట్ అన్నారు.

ఈ ఏడాది మార్చిలో యూరోపియన్ కమిషన్‌తో కలిసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ.. భూమి లాంటి డిజిటల్ ట్విన్‌ను డెవలప్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2024 చివరి నాటికి ఉపగ్రహాల డేటా సాయంతో ఈ డిజిటల్ భూమి శాస్త్రవేత్తల చేతికి వచ్చే అవకాశముంది. దీని సాయంతో వరదలు, కరవు, హీట్‌వేవ్స్, సునామీలను మెరుగ్గా ఎదుర్కొనే వ్యూహాలు తయారుచేయొచ్చు.