Begin typing your search above and press return to search.

లగడపాటి సర్వే.. అంచనా తప్పిన వైనాలే ఎక్కువ?

By:  Tupaki Desk   |   19 May 2019 7:30 AM GMT
లగడపాటి సర్వే.. అంచనా తప్పిన వైనాలే ఎక్కువ?
X
ఆంధ్రా ఆక్టోపస్ అంటూ మీడియా ఆయనకు ముద్ర అయితే వేసింది కానీ, లగడపాటి రాజగోపాల్ ఇప్పటి వరకూ వెలువరించిన సర్వేల్లో నిజం అయిన వాటి కన్నా అంచనాలు తప్పినవే ఎక్కువ అనే విశ్లేషణ సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంది. అందుకు సంబంధించిన ఆధారాలను చూపెడుతూ ఉన్నారు నెటిజన్లు.

ఒక్క 2014 సార్వత్రిక ఎన్నికల విషయంలో తప్ప లగడపాటి అంచనాలు నిజం అయిన దాఖలాలు తక్కువ అని నెటిజన్లు అంటున్నారు. అందుకు సంబంధించిన లగడపాటి రాజగోపాల్ గతంతో ప్రకటించిన సర్వేల వివరాలను, వచ్చిన వాస్తవ ఫలితాలను నెటిజన్లు ప్రస్తావిస్తూ ఉన్నారు.

జగన్ సొంతంగా పార్టీ పెట్టుకున్నా, కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన వెంట వెళ్లగా వచ్చిన ఉప ఎన్నికల్లో కేవలం ఎనిమిది సీట్లలో మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుందని అప్పట్లో లగడపాటి కాంగ్రెస్ హై కమాండ్ కు ఒక సర్వేను ఇచ్చారట! దాన్ని చూసి ఢిల్లీ వాళ్లు ఖుషీ అయ్యారట. అయితే అప్పట్లో బై పోల్ ఫలితాలు ఎలా వచ్చాయో అందరికీ తెలిసిందే!

2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం లగడపాటి వెలువరించిన సర్వే దాదాపుగా నిజం అయ్యింది. కట్ చేస్తే..ఆ తర్వాత లగడపాటి అంచనాలు అన్నీ తప్పుతూ వచ్చాయి. మూడేళ్ల కిందట జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నెగ్గుతుందంటూ లగడపాటి తన అంచనాలను వ్యక్తపరిచారు. అయితే జయలలిత ఆధ్వర్యంలో అన్నాడీఎంకే ఆ ఎన్నికల్లో మంచి మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఇక కర్ణాటక రాష్ట్రంలో కొన్ని నెలల కిందట జరిగిన శాసనసభ ఎన్నికల విషయంలో కూడా లగడపాటి అంచనాలు తప్పిన వైనాన్ని గమనించవచ్చు. కర్ణాటకలో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని లగడపాటి తన అంచనాలను వేశారు. అయితే అక్కడ ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. హంగ్ ఏర్పడింది.

ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో లగడపాటి ఏం చెప్పారు? ఏం జరిగిందో వేరే వివరించనక్కర్లేదు. ఇలా ఐదు సందర్భాల్లో లగడపాటి అంచనాలు నిజం అయినది కేవలం ఒక్కసారి మాత్రమే అని, ఈ సారి కూడా లగడపాటి నంబర్ల విషయంలో కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వరని, పది సీట్లు అటో ఇటూ.. అంటూ స్పష్టత లేని రీతిలో ఎగ్జిట్ పోల్ ఇచ్చి, తెలుగుదేశం పార్టీ లీడ్ లో ఉంటుందని చెప్పే అవకాశాలున్నాయని.. మరి ఈ సారి ఆయన అంచనాలు గతంలాగే తలకిందుల అవుతాయా? లేదా? అనే అంశం తేలాల్సి ఉందని విశ్లేషకులు అంటున్నారు.