Begin typing your search above and press return to search.

ఈ కొత్త కార్డుతో మీరు పాతిక‌వేలు వాడుకోవ‌చ్చు

By:  Tupaki Desk   |   12 Dec 2016 5:20 AM GMT
ఈ కొత్త కార్డుతో మీరు పాతిక‌వేలు వాడుకోవ‌చ్చు
X
పెద్ద నోట్ల రద్దు నేప‌థ్యంలో బ్యాంకర్లు త‌మ‌కు తాముగా విధించుకున్న ప‌రిమితుల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ట్లుంది. లావాదేవీల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతున్న నేప‌థ్యంలో వినియోగ‌దారుల అనుకూల నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఈ కోవ‌లోనే డబ్బు చెల్లించగలిగీ ఎలాంటి క్రెడిట్ కార్డులు లేని వారి కోసం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ క్రెడిట్ లిమిట్‌తో కొత్త కార్డులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. సమాజంలో తక్కువ ఆదాయం కలిగిన వారికోసం రూ.25వేల పరిమితితో ఈ కార్డులను విడుదల చేస్తారని స్టేట్‌బ్యాంక్ వ‌ర్గాలు తెలియజేయి.

‘ప్ర‌స్తుతం ప్రతి బ్యాంకు ఖాతాలో ఎంతో కొంత డబ్బు ఉంది. కాబట్టి మేం వాళ్లకు సురక్షితమైన కార్డును జారీ చేస్తాం. గతంలో ఎలాంటి బ్యాంకింగ్ లావాదేవీలను జరపని వాళ్లకైనా సరే ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. కాకుంటే కార్డు లిమిట్ రూ.25000 ఉంటుంది. బ్యాంకు డిపాజిట్‌ను సెక్యూరిటీగా తీసుకుని క్రెడిట్‌కార్డును జారీ చేస్తాం’ అని ఎస్‌బీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజయ్ జసూజా తెలిపారు. ఏమంటే ప్రజల దగ్గర ఖర్చు చేసేందుకు డబ్బు లేకపోవటం సమస్య కాదని, వారి దగ్గర వినియోగించటానికి కార్డు లేకపోవటమే సమస్య అని విజయ్ అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తరువాత కార్డు వినియోగదారుల సంఖ్య 20 నుంచి 25శాతం మేర పెరిగిందని ఆయన అన్నారు. కార్డు పొందేందుకు నిబంధనలను కూడా సరళీకృతం చేస్తున్నామన్నారు. కార్డులు పొందేందుకు కనీస ఆదాయ అర్హతను తగ్గించటం ద్వారా ఎక్కువమంది వినియోగదారులను క్రెడిట్‌కార్డుల పరిధిలోకి తీసుకురావాలన్నది తమ లక్ష్యమన్నారు. ఏడాది కాలంలో లక్ష కార్డుల నుంచి తొమ్మిది లక్షల వరకు కార్డుల సంఖ్యను పెంచటం తమ టార్గెట్ అని ఆయన వివరించారు.

జన్‌ధన్ ఖాతాదారులకు కూడా క్రెడిట్ కార్డులను అందజేస్తామని ఎస్‌బీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజయ్ జసూజా స్ప‌ష్టం చేశారు. ప్రస్తుతం క్రెడిట్ కార్డుల జారీకి కనీసం 9నుంచి 11 రోజుల సమయం పడుతోందని, ఈ సమయాన్ని రెండు నుంచి మూడు రోజులకు తగ్గిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రముఖ మార్కెట్లలో, మాల్స్‌లలో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి కార్డుల కావలసిన వారితో మాట్లాడి డాక్యుమెంటేషన్ పూర్తి చేసి కార్డుల పంపిణీ చేస్తామన్నారు. ప్రస్తుతం కార్డులు వినియోగిస్తున్న వారు 20 శాతం కార్డుల ద్వారా, 80శాతం నగదు ద్వారా చేస్తున్నారని, కార్డు వినియోగం మరింత పెరగాలని విజయ్ అన్నారు.