Begin typing your search above and press return to search.

వెస్టిండిస్ ప‌ర్య‌ట‌న‌లో ట్విస్ట్‌..వివాదంతో కం బ్యాక్‌!

By:  Tupaki Desk   |   14 Aug 2019 5:30 PM GMT
వెస్టిండిస్ ప‌ర్య‌ట‌న‌లో ట్విస్ట్‌..వివాదంతో కం బ్యాక్‌!
X
భారత క్రికెట్ జట్టు మేనేజర్ సునీల్ సుబ్రమణ్యం తనంతట తానుగా వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం భారత జట్టు కరేబియన్ దీవుల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జట్టు తరఫున మేనేజర్ గా సునీల్ సుబ్రహ్మణ్యం కూడా కరేబియన్ పర్యటనకు వెళ్లారు. అయితే ఈ పర్యటనలో ఆయనపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో బిసిసిఐ వెంటనే సుబ్రమణ్యం ను వెనక్కి పిలిపించింది. కరేబియన్ దీవుల్లో భారత హైకమిషన్ అధికారులతో సుబ్రమణ్యం అమ‌ర్యాద‌గా ప్రవర్తించడంతో పాటు... వారిని అగౌరవ పరిచేలా వ్యవహరించార‌న్న ఆరోపణల నేపథ్యంలో సుబ్రహ్మణ్యంకు షాక్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.

సుబ్రహ్మణ్యంపై తాజా చర్యలతో సరిపెట్టకుండా భవిష్యత్తులోనూ అతడు ఎలాంటి పదవులు చేపట్టకుండా నిషేధించే యోచనలో బీసీసీఐ ఉన్నట్టు తెలుస్తోంది. బీసీసీఐ సమాచారం ప్రకారం ప్రస్తుతం భారత క్రికెటర్లు కరేబియన్ దీవుల పర్యటనలో ఉండడంతో... వీరితో నీటి పొదుపుపై ఓ వీడియో చిత్రీకరించాలని అక్క‌డ‌ భార‌త హైక‌మిష‌న్ అధికారులు సుబ్రహ్మణ్యం కు విజ్ఞప్తి చేశారు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ తోపాటు... వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో ఈ వీడియోను సోమవారం చిత్రీకరించాలని ప్లాన్ చేశారు.

ఈ నేప‌థ్యంలోనే హై కమిషన్ అధికారులు సుబ్రమణ్యంను సంప్రదించగా ఆయన నన్ను సందేశాలతో ముంచెత్త‌కండి అంటూ వారి పట్ల అహంకార పూరిత ధోరణితో వ్యవహరించినట్లు తెలిసింది. వెంటనే కమిషన్ అధికారులు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడంతో... బీసీసీఐ మేనేజర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు... వెంటనే భారత్‌కు రావాలని ఆదేశించింది. ఇక సుబ్రహ్మణ్యం ఈ తరహా ఆరోపణలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు... గతంలోనూ ఆయ‌న‌పై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి.

గత ఏడాది డిసెంబర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా అక్కడ పెర్త్‌లో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అక్కడి క్యాటరింగ్‌ సిబ్బంది, క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆపరేషన్స్‌ మేనేజర్‌ ఆమ్‌ ఫ్రాసెర్‌ను సైతం సుబ్రమణ్యం ఇబ్బంది పెట్టాడు. ఆస్ట్రేలియాపై భార‌త జ‌ట్టు హిస్టారిక‌ల్ విజ‌యం త‌ర్వాత అక్క‌డ మ‌న ఆట‌గాళ్లు సంబ‌రాలు చేసుకునేందుకు బీసీసీఐ అనుమ‌తి ఇచ్చింది. ఆ సంబ‌రాల త‌ర్వాత ఫ్రాసెర్ అక్క‌డ మిగిలిన వ‌స్తువుల‌ను వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోసం తీసుకువెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌గా సుబ్ర‌హ్మ‌ణ్యం వారి ప‌ట్ల విసుగ్గాను, అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించ‌డంతో అప్ప‌ట్లో బీసీసీఐ వార్నింగ్‌తో స‌రిపెట్టింది. తాజాగా మ‌రోసారి ఆయ‌న వివాదంలో చిక్కుకోవ‌డంతో పాటు ఈ విష‌యం కేంద్ర ప్ర‌భుత్వం వ‌ర‌కు వెళ్ల‌డంతో వెంట‌నే ఆయ‌న్ను స్వ‌దేశానికి పిలిపించింది.