Begin typing your search above and press return to search.

ఒలింపిక్స్ లోనూ టీ20 క్రికెట్ మెరుపులు.. ఎప్పటి నుంచి అంటే?

By:  Tupaki Desk   |   21 Nov 2022 12:30 AM GMT
ఒలింపిక్స్ లోనూ టీ20 క్రికెట్ మెరుపులు.. ఎప్పటి నుంచి అంటే?
X
128 సంవత్సరాల తర్వాత ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ చూడడానికి వేళైంది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2028 ఎడిషన్ కోసం రోస్టర్‌లో క్రికెట్ క్రీడను చేర్చడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. 2028 ఒలింపిక్స్ అమెరికన్ నగరంలోని లాస్ ఏంజిల్స్ లో నిర్వహించబడుతుంది. ఇక్కడ క్రికెట్ ను ఆడించాలని ఐసీసీ చూస్తోంది.

ఐసీసీ 2028 ఒలింపిక్స్ గేమ్స్ లో క్రికెట్ ప్రవేశపెట్టాలని ప్రతిపాదన పెట్టింది. అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్ (IOC)కి 6-జట్లు పురుషులు , 6 జట్లు మహిళల టోర్నమెంట్‌ను ప్రతిపాదించింది. ఐసీసీ పురుషుల, మహిళల టీ20ఐ టీమ్‌ ర్యాంకింగ్స్‌ ఆధారంగా టాప్‌ ఆరు జట్లతో ఈ పోటీల్లో పాల్గొనే అర్హత సాధిస్తాయని నివేదిక పేర్కొంది.

ఇక ఖర్చులను తగ్గించుకోవడానికి పురుషులు , మహిళల టోర్నమెంట్‌లు రెండూ ఒకే సమయంలో జరగకుండా ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతాయి. అథ్లెట్ల సంఖ్యను తగ్గించడానికి అన్ని జట్లు కేవలం 14 మంది ఆటగాళ్లతో కూడిన స్క్వాడ్‌లను పేర్కొనాలి.
పోటీ ఫార్మాట్‌లో ఆరు జట్లను మూడు చొప్పున రెండు గ్రూపులుగా విభజించి, మొదటి రెండు జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. నాకౌట్ టైలో గెలిచిన వారు స్వర్ణ పతక గెలుచుకుంటారు. ఇక ఓడిన రెండు జట్లు సిల్వర్, కాంస్య పతక ప్లేఆఫ్‌లో తలపడతాయి.

2028 ఒలింపిక్ గేమ్‌ల కోసం 28 క్రీడలు నిర్ధారించబడినప్పటికీ, బేస్ బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్, బ్రేక్ డ్యాన్స్, కరాటే, కిక్-బాక్సింగ్, స్క్వాష్ మరియు మోటార్‌స్పోర్ట్‌లతో పాటు చేర్చడానికి షార్ట్‌లిస్ట్ చేయబడిన తొమ్మిది క్రీడలలో క్రికెట్ ఒకటి.
ముంబైలో 2023 ఒలింపిక్ సెషన్‌లో ప్రకటన వెలువడే అవకాశం ఉండగా సెప్టెంబర్‌లో దీనిపై తుది నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారు.

1900లో పారిస్‌లో జరిగిన 2వ ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ ఆడారు. చరిత్రలో ఒక్కసారి మాత్రమే భాగమైంది. కేవలం రెండు జట్లు ఫ్రాన్స్ -గ్రేట్ బ్రిటన్ మాత్రమే ఆ టోర్నమెంట్‌లో పాల్గొన్నాయి, బ్రిటన్ బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా, ఫ్రాన్స్ రజతం సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఒలింపిక్స్ లో పతకం వస్తుందా? లేదా? అన్నది చూడాలి.