Begin typing your search above and press return to search.

క్రికెట్ మ్యాచ్ టికెట్ల రచ్చ రచ్చ.. హెచ్ సీఏ పరువు గంగపాలు

By:  Tupaki Desk   |   22 Sep 2022 8:55 AM GMT
క్రికెట్ మ్యాచ్ టికెట్ల రచ్చ రచ్చ.. హెచ్ సీఏ పరువు గంగపాలు
X
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరువు గంగపాలైంది. భారత్ -ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల రగడ హద్దుమీరింది. అన్నీ ఆన్ లైన్ లో సాగుతున్న ఈ కాలంలో కూడా ఆఫ్ లైన్ పద్ధతిలో టిక్కెట్లు విక్రయించి.. అందులోనూ గందరగోళం రేగి.. ఎదురుచూపులతో ఓపిక నశించి.. అభిమానుల తొక్కిసలాట జరిగింది. భారత్-ఆసీస్ మధ్య ఈ నెల 25న ఉప్పల్ మైదానంలో మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జింఖానా గ్రౌండ్స్ వద్ద అభిమానులు టిక్కెట్ల కోసం క్యూలు కట్టారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది.

గురువారం ఉదయం టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. అమ్మకానికి ఉన్నవి మూడు వేల టిక్కెట్లయితే.. 30 వేల మందికి పైగా వచ్చారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. మైదానం కెపాసిటీ అంత స్థాయిలో అభిమానులు రావడం.. ఒకరిని మించి ఒకరు ఎగబడడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. జింఖానా మైదానం గేటు వద్ద తొక్కిసలాటలో ఓ మహిళ స్పృహకోల్పోయింది. పలువురు అభిమానులతో పాటు పోలీసులకూ గాయాలయ్యాయి. ఈ క్రమంలో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వాస్తవానికి తెల్లవారుజాము నుంచే అభిమానులు టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్ వద్ద క్యూ కట్టారు. పోలీసులు కూడా నియంత్రించలేని పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటుచేసుకుంది. అది ఉద్రిక్తంగా మారడంతో హెచ్‌సీఏ టికెట్ కౌంటర్లను మూసివేసింది. కాగా తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదని నార్త్‌జోన్‌ అడిషనల్‌ డీసీపీ స్పష్టం చేశారు.

టికెట్ల కోసం జరిగిన తోపులాటలో మహిళకు గాయాలయ్యాయని.. ప్రస్తుతం ఆమె యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. టికెట్ల విక్రయం విషయంలో హెచ్‌సీఏ మేనేజ్‌మెంట్ నిర్వహణ లోపం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

పరిస్థితిని చూసి మేల్కొనని హెచ్ సీఏ

ఆదివారం క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి ఈ నెల 15న పేటీఎం ఇన్ సైడర్ యాప్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి జింఖానాలో బార్ కోడ్ తో టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంది. బుధవారం నుంచే వీరికి ఈ మేరకు టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ మేరకు మొబైల్, మెయిల్ కు సందేశాలు వచ్చాయి. ఇలాంటివారంతా జింఖానాకు పోటెత్తారు. కానీ, ఉదయం 10 గంటల నుంచి టిక్కెట్ ఇస్తామన్నవారు 12 గంటలైనా ఇవ్వలేదు. గ్రౌండ్ గేట్లు, గోడలు దూకి.. కార్యాలయం, మైదానంలోకి దూసుకెళ్లారు. దీనికితోడు బుక్ చేసుకున్నవారికే కాక రెండో దశలో నేరుగా టిక్కెట్ల ఇస్తామంటూ ప్రచారం జరగడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చాయి. ఈ పరిస్థితిని చూసినప్పటికీ హెచ్ సీఏ అధికారులు గురువారం కూడా మేల్కొనలేదు. ఇది చివరకు ఇక్కడ వరకు తెచ్చింది.

బారులే బారులు..

ఆదివారం జరిగే మ్యాచ్ కోసం టికెట్ల విక్రయాలకు హెచ్‌సీఏ సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో ఏర్పాట్లు చేసింది. వీటి కోసం తెల్లవారుజాము నుంచే అభిమానులు బారులు తీరారు. ప్యారడైజ్‌ కూడలి నుంచి జింఖానా వరకు క్యూలైన్‌ ఏర్పాటు చేస్తే అదంతా నిండిపోయింది. వాళ్లను నియంత్రించేందుకు పోలీసులు అవస్థలు పడ్డారు. మెయిన్‌ గేట్‌ వైపు నుంచి ఒక్కసారిగా తోసుకుని రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈక్రమంలో లాఠీఛార్జ్‌ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మందికి పైగా అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. మరికొంతమందికి అభిమానులతో పాటు 10 మందికిపైగా పోలీసులకు గాయాలయ్యాయి.

హెచ్ సీఏ వైఫల్యంపైనే వేళ్లన్నీ..

వాస్తవానికి మూడేళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండడంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. దీనికితగ్గట్లు హెచ్ సీఏ ఏర్పాట్లు చేయలేక పోయింది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టిక్కెట్ల విక్రయానికి జింఖానాలో కేవలం నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశారు. వాటిలోనూ టిక్కెట్ తీసుకునేందుకు ఆన్‌లైన్‌ పేమెంట్లకు సాంకేతిక లోపం తలెత్తింది. క్రెడిట్, డెబిట్ కార్డులు, యూపీఐ చెల్లింపులు కాక నగదుకు మాత్రమే టికెట్లు విక్రయించారు. ఈ విషయంలో హెచ్‌సీఏ ప్రణాళికా లోపం స్పష్టమైందని తెలుస్తోంది.ఇక మ్యాచ్‌కు సంబంధించిన పాస్‌ల జారీ కూడా గందరగోళంగా మారడంతో హెచ్‌సీఏపై విమర్శలు వచ్చాయి. వీఐపీ పాస్‌ల కోసం తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు ఉండటంతో క్రికెట్ సంఘం అధికారులు తల బాదుకుంటున్నారు.