Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియాతో క్రికెట్టే క్రికెట్టు.. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా

By:  Tupaki Desk   |   17 Aug 2022 11:30 PM GMT
ఆస్ట్రేలియాతో క్రికెట్టే క్రికెట్టు.. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా
X
"ఇండియా పాకిస్థాన్ తో ఆడితేనే మజా.. బంగ్లాదేశ్ తో ఆడితే ఏముంటుంది...?" 20 ఏళ్ల కిందట "దిల్" సినిమాలో హీరో నితిన్ డైలాగ్ ఇది. అయితే, అది అప్పట్లో..ఇప్పుడు కాలం మారింది. పాకిస్థాన్ వెనుకబడిపోయింది. టీమిండియా పైపైకి దూసుకెళ్లింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆస్ట్రేలియాను కూడా దాటేసి సూపర్ పవర్ గా ఎదిగింది. అప్పుడు మన జట్టు ఆస్ట్రేలియాతో తలపడితే ఆస్ట్రేలియాదే గెలుపనేవారు. ఇఫ్పుడు మనదే గెలుపని ఘంటాపథంగా చెబుతున్నారు. అందుకనే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) రెండు జట్ల మధ్యా వరుసగా సిరీస్ లు నిర్వహిస్తున్నాయి. ప్రసారకర్తలు సైతం భారత్-పాక్ సిరీస్ కంటే భారత్-ఆస్ట్రేలియా సిరీస్ లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

గత రెండు సిరీస్ లూ మనవేఒకప్పుడు ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ లు గెలవడం అటుంచి.. టెస్టు మ్యాచ్ లు గెలవడమే గొప్పగా భావించేవారు. అలాంటిది ఇప్పడు మన జట్టు సిరీస్ లే కొట్టుకొస్తోంది. 2019-20,2021-22 సిరీస్ లను వరుసగా గెల్చుకుంది. 2019-20లో సిరీస్ గెలిచి చరిత్రకెక్కిన భారత్.. ఈ ఏడాది దానిని రిపీట్ చేసి అదరహో అనిపించింది. కాగా, ఆయా జట్లు, బోర్డుల షెడ్యూల్ ను ఆధారం చేసుకుని రెండు జట్ల మధ్య సిరీస్ లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్దేశిస్తుంది. దీనిని ఫ్యూచర్ టూర్ ప్లాన్ (ఎఫ్ టీపీ) అంటారు. మంగళవారం మహిళల ఎఫ్టీపీని విడుదల చేసిన ఐసీసీ బుధవారం పురుషుల షెడ్యూల్ నూ ప్రకటించింది. ఐదేళ్ల కాలం అంటే.. 2023-27కు సంబంధించి భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండుసార్లు 5 -టెస్టుల సిరీస్‌లను ఐసీసీ నిర్వహించనుంది.

అప్పటి తర్వాత ఇప్పుడే..భారత్ - ఆసీస్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుండడం 1992 తర్వాత తొలిసారి. కొన్నేళ్లుగా మన జట్టు కూడా మరే ఇతర జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడలేదు. కాకపోతే.. యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్‌-ఇంగ్లాండ్‌ ఐదు మ్యాచ్ లు ఆడుతున్నాయి.

మరోవైపు వచ్చే నాలుగేళ్లలో మొత్తం 12 జట్లు కలిపి 777 అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లను ఆడతాయి. ఇందులో 173 టెస్టులు, 281 వన్డేలు, 323 టీ20లు ఉన్నాయి. వన్డే ఫార్మాట్‌ ప్రాభవం కోల్పోతుందని.. మ్యాచ్‌లు తగ్గించాలని పలువురు చెబుతున్న వేళ.. ఐసీసీ కుదించకపోవడం విశేషం.ఎఫ్‌టీపీలో రెండు ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లు, రెండు టీ20 ప్రపంచకప్‌లు, రెండు వన్డే ప్రపంచకప్‌లు, ఛాంపియన్స్‌ ట్రోఫీ ఉన్నాయి. అయితే.. పాక్‌తో భారత ద్వైపాక్షిక సిరీస్‌లకు ఇందులో చోటు కల్పించలేదు.

అమ్మాయిలకు 65 మ్యాచ్ లు ఇక మూడేళ్లలో భారత మహిళల క్రికెట్‌ జట్టు 65 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. మహిళల క్రికెట్లో తొలి ఎఫ్‌టీపీ (2022-2025) ఇది. ఈ మూడేళ్ల ఎఫ్‌టీపీలో ఏడు టెస్టులు,
135 వన్డేలు, 159 టీ20లతో కలిపి మొత్తం 301 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో భారత్‌ 2 టెస్టులు, 27 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాతో ఒక్కో టెస్టు మ్యాచ్‌లో తలపడుతుంది. 2022 మే నెల నుంచి కొత్త ఎఫ్‌టీపీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో భారత అమ్మాయిలు ఇప్పటికే శ్రీలంకతో మూడేసి వన్డేలు, టీ20లు ఆడేశారు.

ఎఫ్‌టీపీ ప్రకారం సొంతగడ్డపై న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌లతో భారత్‌ తలపడనుంది. ఆసీస్‌, ఇంగ్లాండ్‌, శ్రీలంక (ఇప్పటికే ఆడేసింది), బంగ్లాదేశ్‌లతో ప్రత్యర్థి జట్ల వేదికల్లో పోటీపడుతుంది. ఇక ఎఫ్‌టీపీలోని ఏడు టెస్టుల్లో ఇంగ్లాండ్‌ అత్యధికంగా అయిదు, ఆసీస్‌ నాలుగు, దక్షిణాఫ్రికా మూడు, టీమ్‌ఇండియా రెండు మ్యాచ్‌లు ఆడనుంది.