Begin typing your search above and press return to search.

పనామా పత్రాల్లో క్రికెటర్ కూడా ఉన్నాడు

By:  Tupaki Desk   |   5 April 2016 7:41 AM GMT
పనామా పత్రాల్లో క్రికెటర్ కూడా ఉన్నాడు
X
నల్ల కుబేరుల గుట్టు బయటపెట్టిన పనామా పత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. రాజకీయ.. సినీ.. వ్యాపార వర్గాలకు చెందిన బడా బాబులెందరో ఈ కుంభకోణంలో పాత్రధారులని తేలడంతో ఎన్నో దేశాల్లో ఈ పత్రాలపై విస్తృత చర్చ జరుగుతోంది. మన సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్.. ఐశ్వర్యా రాయ్ లతో పాటు కొందరు వ్యాపార దిగ్గజాల పేర్లు నల్ల కుబేరుల జాబితాలో ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే. మొత్తం 500 మంది దాకా భారతీయుల పేర్లు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే విచారణకు ఆదేశించారు.

కాగా తొలి రోజు జాబితాలో కొందరు భారతీయుల పేర్లు వెల్లడించిన ఇండియన్స్ ఎక్స్ ప్రెస్ పత్రిక ఇవాళ మరికొందరి పేర్లతో రెండో జాబితాను బయటికి తీసింది. ఈ రెండో జాబితాలో పలువురు పారిశ్రామికవేత్తలతోపాటు ఓ మాజీ భారత క్రికెటర్‌ కూడా ఉన్నాడు. ఆ క్రికెటర్ పేరు అశోక్ మల్హోత్రా. ఇతను 1982-86 మధ్యకాలంలో భారత్ తరఫున 7 టెస్టులు, 20 వన్డేలు ఆడాడు. ప్రస్తుతం కోల్‌కతాలో ఓ క్రికెట్ అకాడమీ నడుపుతున్నాడు. అశోక్ తో పాటు మెహ్రా సన్స్ జ్యువెలర్స్ అధినేత అశ్వినీ కుమార్ మెహ్రా.. పారిశ్రామికవేత్తలు గౌతమ్.. కరణ్ థాపర్‌.. సతీష్ గోవింద సంతాని.. విష్లవ్ బహదూర్‌.. హరీశ్ మొహ్‌నాని.. మధ్యప్రదేశ్ రిటైర్డ్ ప్రభుత్వాధికారి ప్రభాష్‌ సంఖ్లా తదితరులు ఉన్నారు. పుణెకు చెందిన సవా హెల్త్‌ కేర్ చైర్మన్ వినోద్ రామచంద్ర జాదవ్.. రాజీవ్ దహుజా.. బెల్లాస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ కు చెందిన కపిల్ సెయిన్ గోయల్‌.. వ్యవసాయ పనిముట్లు అమ్మే వివేక్ జైన్ తదితరుల పేర్లు కూడా లీకైన 'పనామా పత్రాల్లో' ఉన్నట్టు వెల్లడైంది. వీరు పన్ను ఎగ్గొట్టేందుకు పలు బోగస్ కంపెనీల్లో డైరెక్టర్లు, షేర్‌ హోల్డర్లుగా ఉన్నారని తెలిసింది.