Begin typing your search above and press return to search.

దీదీ కేబినెట్ లో క్రికెటర్... క్రీడల మంత్రిగా మనోజ్ తివారీ

By:  Tupaki Desk   |   10 May 2021 11:30 PM GMT
దీదీ కేబినెట్ లో క్రికెటర్... క్రీడల మంత్రిగా మనోజ్ తివారీ
X
భార‌త క్రికెట్ జ‌ట్టులో కీల‌క స‌భ్యుడిగా, సూప‌ర్ బ్యాట్స్‌మ‌న్‌గా ఎదిగిన మ‌నోజ్ తివారీ... ఆ త‌ర్వాత ఎందుక‌నో గానీ అంత‌గా రాణించ‌లేక‌పోయారు. అయితేనేం... త‌న సెకండ్ ఇన్నింగ్స్ లో క్రికెట్ కు గుడ్ బై చెప్పేసి... పాలిటిక్స్ లోకి దిగిపోయాడు. క్రికెట్ లో సుధీర్ఘ కాలం కొన‌సాగ‌లేక‌పోయిన తివారీ.. పాలిటిక్స్ లో ఎంత‌కాలం కొన‌సాగుతాడో తెలియ‌దు గానీ... సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే అదిరిపోయే స్పీడుతో దూసుకుపోతున్నాడు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో అక్క‌డి అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్ త‌ర‌ఫున షిబ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బ‌రిలోకి దిగి విజ‌యం సాధించారు. ఇక ఎన్నికల్లో అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ దీదీ పార్టీ వ‌రుస‌గా మూడోసారి కూడా అధికార ప‌గ్గాలు చేజిక్కించుకుంది. ఈ లెక్క‌న అధికార పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన తివారీ ఏకంగా మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. సోమ‌వారం దీదీ త‌న కేబినెట్ ను ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం 43 మందితో ఏర్పాటు చేసుకున్న కేబినెట్ లో తివారీకి కూడా చోటు క‌ల్పిస్తూ దీదీ నిర్ణ‌యం తీసుకున్నారు.

సోమ‌వారం కోల్ క‌తాలో జ‌రిగిన ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో 43 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. అందులో 24 మంది పూర్తి స్థాయి మంత్రులుగా, 10 మంది సహాయ మంత్రులు, మరో 9 మంది స్వతంత్ర మంత్రులుగా సేవలు అందించనున్నారు. గత ఫిబ్రవరిలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన మనోజ్‌కు షిబ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి చెందిన రథిన్ చక్రవర్తిపై తివారీ 6వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. తొలిసారి ఎమ్మెల్యేగా బెంగాల్ అసెంబ్లీలో అడుగుపెట్టిన తివారీ ఏకంగా మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకోవడం గ‌మ‌నార్హం. మంత్రిగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన తివారీకి యువ‌జ‌న‌, క్రీడల మంత్రిత్వ శాఖ‌ల‌ను కేటాయిస్తూ దీదీ నిర్ణ‌యం తీసుకున్నారు.

మనోజ్ తివారీ క్రికెట్ కెరీర్ ను ప‌రిశీలిస్తే...టీమిండియా తరఫున 2008లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 12 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. జట్టులోని సీనియర్ల కారణంగా అతను అవకాశాలు అందుకోలేకపోయాడు. సెంచరీ చేసిన మరుసటి మ్యాచ్‌కే అతను బెంచ్‌కు పరమితమయ్యాడు. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జ‌ట్ల‌ తరఫున ఆడిన అతనికి 2018 ఐపీఎల్ సీజన్ చివరిది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తం 98 మ్యాచ్‌లు ఆడిన తివారీ 7 హాఫ్ సెంచరీలతో 1695 పరుగులు చేశాడు. ఓ వికెట్ కూడా తీశాడు. అయితే తివారీ ఇప్పటి వరకు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించకపోవడం గమనార్హం. ఇక మరో క్రికెటర్ అశోక్ దిండా సైతం అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అతను కూడా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందాడు.