Begin typing your search above and press return to search.

శ్రీలంక్ష సంక్షోభం: ప్రజల కోసం మాజీ క్రికెటర్ గొప్ప మనసు

By:  Tupaki Desk   |   20 Jun 2022 5:31 AM GMT
శ్రీలంక్ష సంక్షోభం: ప్రజల కోసం మాజీ క్రికెటర్ గొప్ప మనసు
X
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు ఇప్పుడప్పుడే కుదుటపడే సూచనలు కనిపించడం లేదు. కనుచూపు మేరలో ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజలను కాపాడే నాథుడే కనిపించడం లేదు. ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా అది నెరవేరే సూచనలు కనిపించడం లేదు. కనీస అవసరాలు కూడా తీర్చుకునే పరిస్థితి లేక జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ద్రవ్యోల్బణానికి తోడు ఆహార కొరతతో ఏ వస్తువులు, సరుకులు ఓ పట్టాన దొరకడం లేదు.

దీంతో శ్రీలంక ప్రజలు పప్పు దగ్గర నుంచి పెట్రోల్ వరకూ గంటల తరబడి క్యూలైన్ లో నిరీక్షించాల్సిన పరిస్థితులున్నాయి. పెట్రోల్ కోసం క్యూలైన్ లో నిలబడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కలిచివేస్తున్నాయి. గత నాలుగు నెలలుగా శ్రీలంకలో దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిత్యావసర ధరలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొండెక్కాయి. ఆహారంతోపాటు ఇంధనం, ఔషధాల కొరత వారిని తీవ్రంగా వేధిస్తున్నాయి.

పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద క్యూలైన్ లో పడిగాపులు కాస్తున్నారు. ఇలా పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్ లో నిలబడి ఉన్న వారి పట్ల శ్రీలంక మాజీ క్రికెటర్ గొప్ప మనసు చాటుకున్నారు. వారికి టీ, బ్రెడ్ లను స్వయంగా అందజేస్తున్నారు. మాజీ క్రికెటర్ రోషన్ మహనామా ఈ పనిచేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

రాజధాని కొలంబోలోని వార్డ్ ప్లేస్, విజేరామా మావత పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్ లో నిలబడి అలసిపోయిన ప్రజలకు ఆదివారం సాయంత్రం ఆయన టీ, బన్ అందజేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో షేర్ చేశారు. 'ఈ సాయంత్రం కమ్యూనిటీ మీల్ షేర్ బృందంతో కలిసి వార్డ్ ప్లేస్ విజేరామా మావత చుట్టూ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద ఇంధనం కోసం క్యూలో నిలబడిన ప్రజల కోసం టీ, బన్స్ అందించాం.. క్యూలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. దీంతో ప్రజలకు అనేక ఆరోగ్య ప్రమాదాలు ఉంటాయని రోషన్ మహనామా ఆవేదన వ్యక్తం చేశారు.

క్యూలో ఉండే వారు నలతగా ఉండే పక్కవారికి చెప్పండని.. లేదా మద్దతు కోసం 1990కి కాల్ చేయాలని రోషన్ మహనామా పిలుపునిచ్చారు. ఈకష్ట సమయంలో మనం ఒకరికొకరు మద్దతుగా నిలవాలని పిలపునిచ్చారు.

శ్రీలంకలో ఇంధన కొరత తీవ్రమైంది. ధరలు ఆకాశాన్ని అంటాయి. ముందు జాగ్రత్త చర్యగా పెట్రోల్ బంకుల వద్ద పోలీసులు, సైన్యాన్ని మోహరించారు. ఇంధన పొదుపు కోసం రెండు వారాల పాటు విద్యాసంస్థలను శ్రీలంక ప్రభుత్వం మూసివేసింది. శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికే ఏప్రిల్ లో 51 బిలియన్ డాలర్ల విదేశీ రుణాన్ని ఎగవేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధితో చర్చలు జరుపుతోంది.