Begin typing your search above and press return to search.

గంగూలీ మెచ్చిన ఈ క్రికెటర్ ఇప్పుడు రోడ్డు పక్కన.. ?

By:  Tupaki Desk   |   19 Aug 2021 11:30 PM GMT
గంగూలీ మెచ్చిన ఈ క్రికెటర్ ఇప్పుడు రోడ్డు పక్కన.. ?
X
భారతదేశ జాతీయ క్రీడ క్రికెట్ కాకపోయినప్పటికీ దేశవ్యాప్తంగా క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత జాతీయ క్రీడా హాకీ కాగా, ఆ స్పోర్ట్ గురించి ఇంట్రెస్ట్ చూపే వారు కొద్ది మందే అని చెప్పొచ్చు. అయితే, క్రికెట్ మాత్రం అలా కాదు. యూత్ నుంచి మొదలుకుని వృద్ధుల వరకు అందరూ క్రికెట్ మ్యాచ్ వచ్చిందంటే చాలు.. ఇంట్రెస్టింగ్‌గా చూస్తుంటారు. ఇక కొందరైతే తమ పనులు వదిలిపెట్టుకుని మరీ క్రికెట్‌ను అదే పనిగా చూస్తుంటారు.

ఈ నేపథ్యంలోనే క్రికెట్ ఆడటం కూడా దాదాపుగా అందరికీ ఇష్టమే. దేశంలోని ప్రతీ గల్లిలో ఖాళీ దొరికితే పిల్లలు, యువకులు క్రికెట్ ఆడుతుంటారు. అయితే, క్రికెట్ పట్ల చిన్నతనంలోనే ఇంట్రెస్ట్ పెంచుకున్నవారు మాత్రం మెల్లమెల్లగా క్రికెట్‌లో పట్టు సాధించాలనుకుంటారు. ఈ క్రమంలోనే బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని అంశాలపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తుంటారు. ప్రొఫెషనల్‌గా రాణించాలని అనుకుంటారు. అయితే, అందరికీ అవకాశాలు కలిసొచ్చే చాన్సెస్ తక్కువే. కొంత మందికి మాత్రమే త్వరగా అవకాశాలు వస్తుంటాయి. అయితే, అక్కడ వారు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది.

క్రికెటర్‌గా రాణించాలని ఎంతో మంది యువకులు కలలు కంటుండటం మనం చూడొచ్చు. ఈ క్రమంలోనే అసోంకు చెందిన ప్ర‌కాష్ భ‌గ‌త్ అనే ఆల్ రౌండ‌ర్ 2003లో క్రికెటర్ గంగూలీతో క‌లిసి నేష‌న‌ల్ క్రికెట్ అకాడమీలో క్రికెట్ ఆడాడు. ఇక అప్పట్లో ప్ర‌కాష్ భ‌గ‌త్ బౌలింగ్‌ స్టైల్‌ను చూసి గంగూలీ మెచ్చుకున్నాడు కూడా. 2009 నుంచి 2011 వ‌ర‌కు అసోం రంజీట్రోఫి జ‌ట్టులో కీల‌క ఆట‌గాడిగా ఎదిగాడు ప్రకాష్ భగత్. అయితే, 2011లో ప్ర‌కాష్ భ‌గ‌త్ తండ్రి మ‌ర‌ణించ‌డంతో కుటుంబ‌ భారం ప్రకాష్ భగత్‌పై పడింది. దాంతో ప్రకాష్ భగత్ తన తండ్రి నిర్వ‌హించిన పానీపూరీ వ్యాపారాన్ని నిర్వహించడం షురూ చేశాడు.

ఇప్పటికీ అదే వ్యాపారాన్ని అసోంలోని రోడ్డు పక్కన నిర్వ‌హిస్తున్నాడు ప్రకాష్ భగత్. ఈ నేపథ్యంలోనే త‌న‌కు క్రికెట్ అంటే చాలా ఇష్ట‌మ‌ని ప్రకాష్ భగత్ చెప్తున్నాడు. అసోం రంజీలో త‌న‌తో పాటు ఆడిన పలువురు ఆటగాళ్లకు ప్ర‌భుత్వ ఉద్యోగాలు వచ్చాయని, కానీ, త‌న‌కు మాత్రం ఎలాంటి ఉద్యోగం రాలేదని ప్రకాష్ భగత్ వాపోతున్నాడు. ఈ క్రికెటర్ గురించి తెలుసుకుని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో ఇలాంటి క్రీడాకారులెందరో ఉన్నారని, వారందరిని ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రతిభ గల యువకులను గుర్తిస్తే వారి ద్వారా భారత కీర్తి విశ్వజనీనం అవుతుందని పేర్కొంటున్నారు. అయితే, ఒక్క క్రికెట్ మాత్రమే కాకుండా చాలా మంది డిఫరెంట్ క్రీడాంశాల్లో ప్రావీణ్యం సాధించిన వారు ఉన్నారని చెప్తున్నారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రభుత్వం బాగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే వారికి సరియైన రీతిలో కోచింగ్ ఇచ్చి తీర్చిదిద్దితే వారి ద్వారా భారత్‌కు విశ్వక్రీడా సంబురాల్లో పతకాలు లభించొచ్చని అంటున్నారు. ఇటీవల జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. అయితే, ఈ సారి భారత్‌కు ఏడు పతకాలు లభించాయి. అందులో ఒకే ఒక్క గోల్డ్ మెడల్ ఉంది.