Begin typing your search above and press return to search.

73 మంది ఎమ్మెల్యేల‌పై క్రిమిన‌ల్ కేసులు

By:  Tupaki Desk   |   14 Dec 2018 6:36 AM GMT
73 మంది ఎమ్మెల్యేల‌పై క్రిమిన‌ల్ కేసులు
X
తెలంగాణ‌లో కొలువుదీరిన కొత్త అసెంబ్లీకి సంబంధించి తాజాగా ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. తాజా ఎన్నిక‌ల్లో ఎన్నికైన 73 మంది ఎమ్మెల్యేల‌పై క్రిమిన‌ల్ కేసులు ఉన్న‌ట్లు వెల్ల‌డైంది. అసోసియేష‌న్ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ రిఫార్మ్స్(ఏడీఆర్‌) సంస్థ ఈ గ‌ణాంకాల‌ను బ‌య‌ట‌పెట్టింది.

రాష్ట్ర అసెంబ్లీకి మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక‌య్యారు. వారిలో 73 మంది త‌మ‌పై క్రిమిన‌ల్ కేసులు ఉన్న‌ట్లు నామినేష‌న్ ప‌త్రాల్లో స్వ‌యంగా వెల్ల‌డించారు. అంటే మొత్తం ఎమ్మెల్యేల్లో 61 శాతం మందిపై ఈ కేసులున్నాయ‌న్న‌మాట‌. గ‌త అసెంబ్లీతో పోలిస్తే ఇప్పుడు నేర‌చ‌రిత్ర‌ గ‌ల ఎమ్మెల్యేల సంఖ్య 5 శాతం పెరిగింది. 2014లో ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 67 మందిపై, అంటే 56 శాతం ఎమ్మెల్యేల‌పై క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయి. 2014లో 46 మంది ఎమ్మెల్యేల‌పై ఉన్న‌వి తీవ్ర‌మైన కేసులు కాగా.. ఈ ద‌ఫా తీవ్ర‌మైన కేసులున్న ఎమ్మెల్యేల సంఖ్య 47కు పెరిగింది.

పార్టీల వారీగా చూస్తే టీఆర్ ఎస్‌ కు చెందిన 50 మంది ఎమ్మెల్యేల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదై ఉన్నాయి. 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌పై - ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేల‌పై - ఆరుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలకు నేర‌చ‌రిత్ర ఉంది. బీజేపీ త‌ర‌ఫున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా త‌న‌పై క్రిమిన‌ల్ కేసులున్న సంగ‌తిని స్వ‌యంగా వెల్ల‌డించారు.

నామినేష‌న్ ప‌త్రాల విశ్లేష‌ణ ఆధారంగా ఏడీఆర్ తాజా గ‌ణాంకాల‌ను విడుద‌ల చేసింది. ఎమ్మెల్యే అభ్య‌ర్థులు త‌మపై ఉన్న కేసుల వివ‌రాల‌ను స్ప‌ష్టంగా వెల్ల‌డించాల్సిందేన‌ని.. లేనిప‌క్షంలో అన‌ర్హ‌త వేటు తప్ప‌ద‌ని ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. త‌మ కేసుల వివ‌రాలు తెలియ‌జేస్తూ ప్ర‌చార స‌మ‌యంలో మీడియాలో అభ్య‌ర్థులు ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వాల‌ని కూడా ఈసీ ఆదేశించింది. దీంతో ఆయా అభ్య‌ర్థులపై కేసుల వివ‌రాలు ప‌క్కాగా బ‌య‌టికొచ్చాయి.