Begin typing your search above and press return to search.

పంజాబ్ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు.. రీజ‌న్ ఇదే!

By:  Tupaki Desk   |   11 April 2022 1:30 AM GMT
పంజాబ్ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు.. రీజ‌న్ ఇదే!
X
కొత్త‌గా కొలువుదీరిన పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌) స‌ర్కారుపై పొరుగున ఉన్న హ‌రియాణ స‌ర్కారు నేత‌లు కొన్ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం పంజాబ్ ఆర్థిక ప‌రిస్థితి బాగోలేద‌ని.. ఇప్పుడు దీనిని రిపేర్ చేయాల్సి ఉంద‌ని.. హ‌రియాణ విద్యుత్ శాఖ మంత్రి రంజిత్ సింగ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కొత్త‌గా బాధ్య‌త‌లు తీసుకుని మూడు శుక్ర‌వారాలు కూడా గ‌డ‌వ‌ని.. పంజాబ్ ఆప్ మంత్రుల‌పై ఆయ‌న విరుచుకు ప‌డ్డారు. ``ఆ మంత్రుల‌కు ఏం అనుభ‌వం ఉంది? ప్ర‌బుత్వాన్ని ఎలా న‌డుపుతారు?`` అని అన్నారు.

అంతేకాదు.. ఆప్ మంత్రివ‌ర్గంలో ఉన్న‌నేత‌ల‌పైనా ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. మంత్రుల్లో ఒక‌రిద్ద రు ఆటోడ్రైవ‌ర్లు ఉన్నార‌ని.. వారికి విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు ఎలా తీసుకోవ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని.. వారికి అసలు రాజ్యాంగం అంటేఏంటో కూడా తెలియ‌ద‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు... ప్ర‌స్తుతం ఉన్న మంత్రి వ‌ర్గంలో అస‌లు 90 శాతం మంది మంత్రులు.. ఇప్ప‌టి వ‌ర‌కు విధాన స‌భ ఎలా ఉంటుందో .. ఎక్క‌డ ఉంటుందో.. దాని రూపు రేఖ‌లు ఏంటో కూడా తెలియ‌వ‌ని దుయ్య‌బ‌ట్టారు.

``వారికి విధాన స‌భ అంటే... ముక్కు మొహం తెలియ‌దు. ఇక‌, రాజ్యాంగం అంటే.. తెలిసే అవ‌కాశం లేదు. వీరు ఎలా పాలిస్తారు? వీరు ఎలా ముందుకు సాగుతారు? రాష్ట్రం ఇప్పుడు తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిస్థితిలో ఉంది. గ‌త కాంగ్రెస్ పాల‌న‌తో రాష్ట్రం అన్ని విధాలా న‌ష్ట‌పోయింది. ముఖ్యంగా రైతుల ఉద్య‌మాలు... ధాన్యం కొనుగోళ్లు వంటివి రాష్ట్రానికి శాపంగా మారాయి. ఇలాంటి వాటిని అధిగ‌మించాలంటే.. వ్యూహాత్మ కంగా అడుగులు వేయాలి. కానీ.. ఇప్పుడు అంత సీన్ లేద‌ని అనిపిస్తోంది!`` అని రంజిత్‌సింగ్ వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. మంత్రుల వ్య‌క్తిగ‌త జీవితంపైనా కొన్ని విమ‌ర్శ‌లు చేశారు. ``కొంద‌రు మంత్రులు.. మొబైల్స్ రిపేర్ చేసుకునే వృత్తి నుంచి వ‌చ్చారు. మ‌రికొంద‌రు.. ఆటోడ్రైవ‌ర్ల నుంచి రాజ‌కీయాల్లోకివ‌చ్చారు. వీరు ప్ర‌భుత్వాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తారు. ఆర్థిక ప‌రిస్థితిని ఎలా చక్క‌దిద్దుతారు?`` అని రంజిత్ సింగ్ ప్ర‌శ్నించారు. ఈ ఏడాది జ‌రిగిన ఐదు రాష్ట్రాల‌ ఎన్నిక‌ల్లో నాలుగు చోట్ల బీజేపీ విజ‌యం సాధించ‌గా.. కాంగ్రెస్ పాలిత‌ పంజాబ్‌లో ఆ పార్టీని గ‌ద్దె దించి.. ఆప్ అధికారం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే.