Begin typing your search above and press return to search.

ఆ సినిమాపై విమర్శలు.. కేజ్రీవాల్‌ ఇంటిముందు బీజేపీ భారీ నిరసన.. ఢిల్లీలో రాజకీయ రచ్చ

By:  Tupaki Desk   |   30 March 2022 2:30 PM GMT
ఆ సినిమాపై విమర్శలు.. కేజ్రీవాల్‌ ఇంటిముందు బీజేపీ భారీ నిరసన.. ఢిల్లీలో రాజకీయ రచ్చ
X
అసలే ఉప్పు నిప్పులా ఉండే ఢిల్లీ ప్రభుత్వం- కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు.. గత నెలలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ మరింత రాజుకున్నాయి. పంజాబ్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే.. బీజేపీ-ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే, ఫలితాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ (18)నే రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వ అండతో పంజాబ్ లో బీజేపీ.. మాజీ సీఎం అమరీందర్ సింగ్ పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాళీదళ్ (సంయుక్త) తో పొత్తు పెట్టుకుని బరిలో దిగింది.

అయితే, బీజేపీ గెలిచింది రెండే సీట్లు కాగా.. కూటమిలోని మిగతా రెండు పార్టీలు ఖాతా తెరవలేకపోయాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం 92 సీట్లు గెలిచి విజయ ఢంకా మోగించింది. కేంద్రంలోని బీజేపీకి ఇది మరింత కంటగింపే. ఎందుకంటే.. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కేంద్రం ముప్పుతిప్పలు పెట్టింది. ఆఖరుకు కొవిడ్ సమయంలోనూ సాయంలో జాప్యం చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అయితే .. తరచూ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ పెట్టిన చికాకు సరేసరి. అలాంటి ఆప్.. పంజాబ్ కూ విస్తరించి అధికారం కైవసం చేసుకోవడం అంటే బీజేపీ పెద్దలకు కడుపు మంటే..

కశ్మీర్ ఫైల్స్ నిప్పులు..
ఇటీవల విడుదలైన బాలీవుడ్ సినిమా'ది కశ్మీర్‌ ఫైల్స్‌'తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను కేంద్ర ప్రభుత్వం మరింత ప్రోత్సహించింది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలైతే వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చాయి. అయితే, దీనిపై ఇటీవల ఢిల్లీ అసెంబ్లీలో సీఎం కేజ్రీవాల్ తీవ్ర వాగ్బాణాలు సంధించారు. కశ్మీరీ పండిట్ ల పేరిట కొందరు డబ్బు దండుకుంటున్నారని విమర్శించారు. ''వినోద పన్ను మినహాయింపు ఎందుకు..? సినిమాను యూట్యూబ్ లో ఉంచితే అందరూ ఫ్రీగా చూస్తారుగా? ''అని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ పెద్ద ఎత్తున మండిపడింది. కశ్మీర్ పండిట్లను అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

క్షమాపణలు చెప్పాలని కూడా కోరింది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌ ఫైల్స్ పై కేజ్రీవాల్‌ వ్యాఖ్యలకు నిరసనగా భాజపా యువ మోర్చా(బీజేవైఎం) బుధవారం ఆందోళన చేపట్టింది. ఇది కాస్తా ఉద్రిక్తతలకు దారితీసింది. సీఎం ఇంటి ముందు ఆందోళన చేపట్టిన నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రికేడ్లను దాటుకుని వచ్చి కేజ్రీవాల్‌ నివాసం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలు, గేటును ధ్వంసం చేశారు. సీఎం ఇంటి గేటుకు కాషాయ రంగు చల్లారు.

భాజపా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య నేతృత్వంలో ఈ ఆందోళన చేపట్టారు. ఆయన బారికేడ్లు ఎక్కుతున్న దృశ్యాలు బయటికొచ్చాయి. దాదాపు 150-200 మంది ఈ ఆందోళనల్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు దాదాపు 70 మందిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇది గూండాగిరీనే.. ఆప్ ధ్వజం
కేజ్రీ నివాసం ముట్టడి ఘటనపై ఢిల్లీ అధికార పార్టీ ఆమ్‌ ఆద్మీ పార్టీ మండిపడింది. కేజ్రీవాల్‌ ఇంటి వద్ద గూండాలు విధ్వంసం సృష్టించారు. ''బీజేపీ పోలీసులు'' వారిని ఆపలేదు సరికదా.. గేటు వద్దకు తీసుకొచ్చారు'' అని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా దుయ్యబట్టారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమ్‌ ఆద్మీ పార్టీ ట్విటర్లో షేర్‌చేస్తూ.. భాజపాపై మండిపడింది. ''పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయంతో ఉలిక్కిపడిన భాజపా.. కేజ్రీవాల్‌ను చంపాలని చూస్తోందా..?'' అంటూ దుయ్యబట్టింది.