Begin typing your search above and press return to search.

ఏపీ ఐటీ మంత్రి విషయంలో పరిశీలకుల పెదవి విరుపులు!

By:  Tupaki Desk   |   22 Nov 2019 12:05 PM GMT
ఏపీ ఐటీ మంత్రి విషయంలో పరిశీలకుల పెదవి విరుపులు!
X
ఒకవైపు లూలూ గ్రూప్ ఏపీ నుంచి వైదొలగడాన్ని తెలుగుదేశం పార్టీ క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. మరోవైపు ఏపీలో ఇండస్ట్రీస్ నెలకొల్పడం విషయంలో దూకుడు కనిపించడం లేదు. ఒకవేళ కొన్ని కంపెనీలు వస్తున్నా.. వాటి విషయాలను హైలెట్ చేయలేకపోతూ ఉన్నారని..ఏపీ ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మీద విశ్లేషణలు సాగుతూ ఉన్నాయి.

ఐటీ వంటి శాఖ చేతిలో ఉన్నా గౌతమ్ రెడ్డి అటు శాఖను హైలెట్ చేయలేక, ఇటు తను హైలెట్ కాలేకపోతున్నారని ఆయన విషయంలో పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఐటీ శాఖ నుంచి బజ్ రావడం లేదని.. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా దృష్టి సారించాలనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.

ప్రతి ప్రభుత్వ హయాంలోనూ ఎన్నో కొన్ని పరిశ్రమలు ఏర్పడుతూ ఉంటాయి. వాటి విషయంలో ఏపీకి ప్రస్తుతానికి ఢోకా లేదు. సహజంగా కొన్ని ఏర్పాటు అవుతూ ఉన్నాయి. కొన్ని కంపెనీస్, ఇండస్ట్రీలు వస్తూ ఉన్నాయి. అయితే బాధ్యతాయుతమైన మంత్రులు అంతకు మించి సాధించే ప్రయత్నం చేయాలి.

తెలుగుదేశం హయాంలో నారా లోకేష్ బాబు ఐటీ శాఖా మంత్రిగా వ్యవహరించారు. అయితే ఆయన సాధించింది ఏమీ లేదు. లోకేష్ కు పెద్దగా అవగాహన లేకపోవడమే కాదు, కనీసం కమ్యూనికేషన్ కూడా లేదు. ఐటీ సదస్సుల్లో పాల్గొని, అక్కడ చేసిన ప్రసంగాలతో లోకేష్ మరింత నవ్వుల పాలయ్యారు. లోకేష్ కన్నా ముందు పల్లెరఘునాథ రెడ్డి ఆ బాధ్యతల్లో ఉండే వారు. అయన సాధించిందీ శూన్యమే.
ఇప్పుడు మేకపాటి గౌతమ్ కూడా ఆ శాఖ విషయంలో ఎలాంటి మార్కును వేయలేకపోతూ ఉన్నారనే అభిప్రాయాలు నిపుణుల నుంచి వినిపిస్తూ ఉన్నాయి.

పారిశ్రామిక అధిపతులతో సమావేశం కావడం, ఏపీలో ఉన్న అవకాశాల గురించి వివరించడం, ప్రణాళికలను వారికే చెప్పడం.. వంటి వాటి ద్వారా కొత్త పెట్టుబడులను రాబట్టి, పరిశ్రమలను ఏర్పరచడానికి అవకాశాలు ఉంటాయి. వాటిని అంతగా ఉపయోగించుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇండస్ట్రీయలిస్టులను మీట్ అయ్యి, వారిని కన్వీన్స్ చేయడానికి కూడా పెద్దగా ప్రయత్నాలు జరగడం లేదని ఆ వర్గాలే చర్చించుకుంటున్నాయి. మంత్రిగా గౌతమ్ రెడ్డికి ఇంకా సమయం అయితే ఉంది. ఆ సమయాన్ని అయినా ఆయన మంచి ఉపయోగించకుంటారేమో చూడాలని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.