Begin typing your search above and press return to search.

భారీ వర్షాలతో టీటీడీకి కోట్ల నష్టం

By:  Tupaki Desk   |   21 Nov 2021 8:34 AM GMT
భారీ వర్షాలతో టీటీడీకి కోట్ల నష్టం
X
భారీ వర్షాలు దక్షిణ ఆంధ్రాను అతలాకుతలం చేశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ధాటికి తమిళనాడు, దక్షిణ ఆంధ్రాలో ఏరులై పారింది. భారీ వర్షాలతో తిరుమల తీవ్ర నష్టం ఏర్పడింది. రోడ్లు, రక్షణ గోడలు దెబ్బతిన్నాయి. వీటికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం తెలిపారు.

తిరుమల, తిరుపతిపై 30ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈనెల 17వ తేదీ నుంచి 19వరకూ వర్షాలు కురిశాయని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యాములు పొంగి కపిలతీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంచెత్తినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

వర్షాల వల్ల తిరుమలలో రూ.4 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మొదటి ఘాట్ రోడ్డులోని అక్కగార్ల గుడి వద్ద రక్షణ గోడ దెబ్బతిందని.. ఘాట్ రోడ్డులోని నాలుగు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయని పేర్కొన్నారు. టీటీడీ సిబ్బంది, అధికారులు యుద్ధ ప్రాతిపదికన వీటిని తొలగించి రక్షణ ఏర్పాట్లతో ట్రాఫిక్ ను పునరుద్దరించారని తెలిపారు.

రెండో ఘాట్ రోడ్ లో 13 ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయని.. ఐదు ప్రాంతాల్లో రక్షణ గోడలు దెబ్బతిన్నాయని.. తిరుమల నారాయణ గిరి గెస్ట్ హౌస్ ను ఆనుకొని ఉన్న రక్షణ గోడ పడిపోవడంతో మూడు గదులు దెబ్బతిన్నాయని వెల్లడించారు. శ్రీవారి మెట్టు మార్గంలో కొంతమేరకు రోడ్డు, ఫుట్ పాత్ దెబ్బతిన్నాయన్నారు.

కపిల తీర్థం ఆలయంలో ఒక మండపం వర్షాలకు దెబ్బతిందని.. దీన్ని మరమ్మతులకు రూ.70 లక్షలు ఖర్చు కావచ్చని అధికారులు అంచనా వేశారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు శ్రీనివాసం, మాధవం, రెండు, మూడు సత్రాల్లో వసతి, ఆహారం ఏర్పాటు చేశామని తెలిపారు.

ఇక టికెట్లు ఉండి దర్శనానికి రాలేకపోయిన భక్తులను వర్షాలు తగ్గాక దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు.