Begin typing your search above and press return to search.

శ్రీనగర్ నిట్ లో తెలుగు విద్యార్థులపై దాడి?

By:  Tupaki Desk   |   6 April 2016 7:35 AM GMT
శ్రీనగర్ నిట్ లో తెలుగు విద్యార్థులపై దాడి?
X
టీ20 క్రికెట్ వరల్డు కప్ సెమీ ఫైనల్సులో టీమిండియా ఓడిపోయిన నేపథ్యంలో శ్రీనగర్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో గత శుక్రవారం చోటుచేసుకున్న అల్లర్లు మరింత పెరిగాయి. గొడవల నేపథ్యంలో నిట్ ను కొద్దిరోజులు మూసేసి మళ్లీ మంగళవారం తెరిచినప్పటికీ... మంగళవారం అల్లర్లు మరింత అధికమయ్యాయి. వివాదాలు ముదిరి అది లోకల్ - నాన్ లోకల్ స్టూడెంట్ల మధ్య గొడవలకు దారితీసింది. ఈ గొడవల్లో తెలుగు విద్యార్థులు కొందరు గాయపడినట్లుగా తెలుస్తోంది.

తొలుత చిన్న వివాదంగా మొదలైన గొడవలు... తాజాగా లోకల్ - నాన్ లోకల్ విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీశాయి. ప్రస్తుతం రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. ఈ దాడుల్లో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గొడవలపై సమాచారం అందుకున్న ప్రభుత్వం సీఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దించింది. వర్సిటీలోకి రంగప్రవేశం చేసిన వెంటనే సీఆర్పీఎఫ్ బలగాలు కనిపించిన విద్యార్థులపై లాఠీలు ఝుళిపించాయి.

అయితే.. ఈ గొడవల్లో తలదూర్చేందుకు ఇష్టం లేని విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా అది సాధ్యపడడంలేదు. విద్యార్థులను ఇల్లకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించడం లేదు. ఇలా ఇంటికెళతామన్నా, పంపించని పోలీసులపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులతో పాటు పలు ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా నిట్ లోనే చిక్కుకుపోయారు. గొడవల నేపథ్యంలో ఎప్పుడేమవుతుందో అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

మార్చి 31న జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడంతో కాశ్మీరీ విద్యార్థులు సంబరాలు జరిపారు. దీన్ని ఇతర రాష్ట్రాల విద్యార్థులు వ్యతిరేకించారు. దీంతో రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. ప్రస్తుతం శ్రీనగర్ నిట్ లో ఉద్రిక్త వాతావరణం ఉంది.