Begin typing your search above and press return to search.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం!

By:  Tupaki Desk   |   1 Dec 2022 10:40 AM GMT
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం!
X
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం సంభవించింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎర వేసిన కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలకు తెలంగాణ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. వీరికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ప్రతి సోమవారం సిట్‌ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితులు బెయిల్‌ కోసం రూ.3 లక్షల పూచీకత్తు చెల్లించాలని సూచించింది. అలాగే ఇద్దరు ష్యూరిటీ కూడా ఇవ్వాలంది. అలాగే ముగ్గురూ తమ పాస్‌పోర్టులను పోలీస్‌ స్టేషన్‌లో సరెండర్‌ చేయాలని తెలిపింది.

కాగా మరోవైపు రామచంద్ర భారతిపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. నకిలీ ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు నకిలీ పాస్‌పోర్టు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఆయనపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.

హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ ఈ కేసుల్లో ఆయన్ను బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

అలాగే నందకుమార్‌పైనా బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఐదు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఫిలింనగర్‌లోని డెక్కన్‌ కిచెన్‌ లీజు విషయంలో వివిధ సెక్షన్ల కింద వేర్వేరు కేసులతో పాటు బెదిరింపు కేసులు సైతం పోలీసులు ఆయనపై నమోదు చేశారు. ఓ కేసులో ఇది వరకే నందకుమార్‌ను కస్టడీలోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

మరోవైపు హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తీవ్ర నేరమైన కేసని ప్రభుత్వ తరపు లాయర్‌ దుశ్యంత్‌ దవే పేర్కొన్నారు. బీజేపీకి సంబంధం లేకుంటే విచారణకు సహకరించాలన్నారు. బీజేపీకి సంబంధం లేదంటూనే నిందితుల తరపున పిటిషన్‌ వేస్తారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో ఆయన వాదనలు వినిపించారు.

దేశంలో అనేక ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిందని దుష్యంత్‌ దవే గుర్తు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవాలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని విమర్శించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి విమానాల్లో తీసుకెళ్లి ప్రభుత్వాలు పడగొట్టారని కోర్టు దృష్టికి తెచ్చారు. కేసు నమోదైన మరుక్షణం నుంచి.. కేసును వీక్‌ చేసే ప్రయత్నం బీజేపీ చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడమే కేంద్రం లక్ష్యమని ధ్వజమెత్తారు. లాయర్‌ దుశ్యంత్‌ దవే వాదనలను బీజేపీ న్యాయవాది అడ్డుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.