Begin typing your search above and press return to search.

భారీగా ప‌డిపోయిన చ‌మురు ధ‌ర‌లు

By:  Tupaki Desk   |   18 Aug 2015 12:13 PM GMT
భారీగా ప‌డిపోయిన చ‌మురు ధ‌ర‌లు
X
ముడిచ‌మురు ధ‌ర ప‌డిపోయింది. అది కూడా అలా ఇలా కాకుండా భారీగా ప‌డిపోయింది. ఒక‌ప్పుడు బ్యారెల్ ధ‌ర వంద డాల‌ర్లకు పైకి వెళ్లిన ధ‌ర‌లు తాజా ప‌త‌నంతో 41.80 డాల‌ర్ల‌కు ప‌డిపోయింది. మొన్న‌టివ‌ర‌కూ బ్యారెల్ ధ‌ర 50 డాల‌ర్ల కాస్త అటూ ఇటూగా ఉన్న ధ‌ర కాస్తా.. ఇప్పుడు ఏకంగా ప‌ది డాల‌ర్ల మేర ప‌డిపోవ‌టం అనూహ్య ప‌రిణామంగా చెబుతున్నారు.

అంత‌ర్జాతీయంగా త‌గ్గిన డిమాండ్ తో రోజురోజుకీ ప‌డిపోతున్న చ‌మురు ధ‌ర‌లు తాజా ప‌త‌నంతో.. ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి చేరుకున్న‌ట్లు అయ్యింది. సెప్టెంబ‌రులో డెలివ‌రీ ఇచ్చేందుకు ఒప్పందాల కోసం ధ‌ర‌ను నిర్ణ‌యించిన నేప‌థ్యంలో ఈ భారీ ప‌త‌నం చోటు చేసుకుంద‌ని చెబుతున్నారు.

2009 త‌ర్వాత ఇంత క‌నిష్ఠ స్థాయికి ముడిచ‌మురు ధ‌ర ప‌డిపోవ‌టం ఇదే తొలిసారి కావ‌టం గ‌మ‌నార్హం. ఈ భారీ ప‌త‌నం భార‌త్ కు బాగా క‌లిసి రానుంది. దేశంలోని విలువైన విదేశీ మార‌క‌ద్ర‌వ్యం మొత్తం.. ముడిచ‌మురు బిల్లుల‌కు ఎక్కువ‌గా వినియోగిస్తున్న నేప‌థ్యంలో.. తాజా ప‌త‌నం భార‌త్‌కు క‌లిసి రావ‌టం ఖాయం.

మ‌రోవైపు.. ప్ర‌తి ప‌దిహేను రోజుల‌కు ఒక‌సారి అంత‌ర్జాతీయ మార్కెట్ల‌కు అనుగుణంగా పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని మార్చే నేప‌థ్యంలో.. తాజా ప‌త‌నంతో ఈ నెలాఖ‌రులో లీట‌రు పెట్రోల్.. డీజిల్‌కు రూ.4పైనే త‌గ్గించే వీలుంద‌ని చెబుతున్నారు.గ‌త రెండు సార్ల నుంచి త‌గ్గుతున్న పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు ఈసారి మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉందంటున్నారు. అయితే.. ఈ ధ‌ర‌ల త‌గ్గింపు కార‌ణంగా.. పెట్రోల్‌.. డీజిల్ అమ్మ‌కాల‌పై వ‌చ్చే ప‌న్నుల మొత్తం త‌గ్గిపోనుంది. అదే జ‌రిగితే.. అంచాల కంటే త‌క్కువ ఆదాయం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంది. అందుకే.. అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు భారీగా త‌గ్గినా..లీట‌రు పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల విష‌యంలో మాత్రం త‌గ్గింపు పీనాసిత‌నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి.. ఈ నెలాఖ‌ర‌కు ఎంత‌మేర త‌గ్గిస్తారో చూడాలి.