Begin typing your search above and press return to search.

దిగుతున్న చ‌మురు ధ‌ర‌లు..మా సంగ‌తేంది మోడీ?

By:  Tupaki Desk   |   18 July 2018 4:10 AM GMT
దిగుతున్న చ‌మురు ధ‌ర‌లు..మా సంగ‌తేంది మోడీ?
X
అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు పెరుతున్నాయంటూ అదే ప‌నిగా పెట్రోల్‌.. డీజిల్ మీద ధ‌ర‌లు పెంచుకుంటూ పోవ‌టం తెలిసిందే. అంత‌ర్జాతీయంగా ధ‌ర పెరిగిన వెంట‌నే ధ‌ర‌లు పెంచేయ‌టం.. త‌గ్గిన‌ప్పుడు మాత్రం ఆ మేర‌కు త‌గ్గించ‌క‌పోవ‌టం మోడీ హ‌యాంలో మామూలే. ధ‌ర‌లు పెరిగేట‌ప్పుడు ఆ భారాన్ని ప్ర‌జ‌ల మీద వేసేట‌ప్పుడు చూపించే ఉత్సాహం.. దూకుడు.. అంత‌ర్జాతీయంగా ధ‌ర‌లు తగ్గే వేళ‌లో.. త‌గ్గింపు రిలీఫ్ ను ప్ర‌జ‌ల‌కు బ‌దిలీ చేయ‌టంలో మాత్రం మోడీ పెద్ద‌గా ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించ‌రు.

అప్పుడెప్పుడో యూపీఏ హ‌యాంలో బ్యారెల్ ముడిచ‌మురు ధ‌ర 110 డాల‌ర్లను దాటిన‌ప్పుడు ఎంత ధ‌ర‌లు అయితే ఉన్నాయో.. 80 డాల‌ర్లకు చేరుకున్నంత‌నే పెద్ద ఎత్తున ధ‌ర‌లు పెరిగిపోవ‌టం చూస్తున్న‌దే. అంత‌ర్జాతీయంగా చోటు చేసుకున్న ప‌రిణామాల కార‌ణంగా ఆ మ‌ధ్య దూకుడుగా పెరిగిన ముడిచ‌మురు ధ‌ర‌లు ఇప్పుడు త‌గ్గుముఖం పట్టాయి. ప్ర‌స్తుతం ముడి చ‌మురు బ్యారెల్ ధ‌ర 68 నుంచి 72 డాల‌ర్ల మ‌ధ్య న‌డుస్తోంది. సోమ‌వారం ఒక్క‌రోజులోనే బ్యారెల్ చ‌మురు ధ‌ర 4.6 శాతం మేర త‌గ్గింది.

ఉన్న‌ట్లుండి చ‌మురు ధ‌ర‌లు ఎందుకు త‌గ్గుతున్నాయి? అంటే.. అంత‌ర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలే కార‌ణంగా చెప్పాలి. ముడి చ‌మురు ఉత్ప‌త్తిని సౌదీ అరేబియా పెంచ‌టం.. అమెరికాలో షేల్ ఆయిల్ ఉత్ప‌త్తి పెర‌గ‌టం కూడా ధ‌ర‌లు త‌గ్గ‌టానికి కార‌ణంగా చెప్పాలి. ఆంక్ష‌ల నేప‌థ్యంలో ఇరాన్ నుంచి ముడిచ‌మురు స‌ర‌ఫ‌రా పూర్తిగా నిలిచిపోయినా.. సౌదీ ఆరేబియా ఉత్ప‌త్తి పెంచి ఆ లోటును భ‌ర్తీ చేస్తుందంటూ అమెరికా చేసిన ప్ర‌క‌ట‌న కూడా ధ‌ర‌లు దిగి రావ‌టానికి కార‌ణంగా చెప్పాలి.

తాజా ప‌రిణామాలు చూస్తే.. చ‌మురు ఉత్ప‌త్తిని పెంచ‌టానికి అమెరికా అధ్య‌క్షుడి సూచ‌న‌ను సౌదీ రాజు అంగీక‌రిస్తున్న‌ట్లుగా చెప్పాలి. సౌదీతో పాటు ఒపెక్ స‌భ్య దేశాలైన కువైట్‌.. యూఎఈ కూడా ముడిచ‌మురు ఉత్పత్తిని పెంచిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో ముడి చ‌మురు ఉత్ప‌త్తి త‌గ్గిస్తాన‌ని గ‌తంలో చెప్పిన ర‌ష్యా సైతం.. త‌మ మార్కెట్ ఎక్క‌డ పోతుందో అన్న ఉద్దేశంతో ముడిచ‌మురు ఉత్ప‌త్తిని పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఇప్ప‌టిదాకా ముడిచ‌మురు ధ‌ర‌లు పెరుగుతున్న దానికి భిన్నంగా త‌గ్గుతున్న వైనం ఎన్నాళ్లు ఉంటుంద‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. న‌వంబ‌రు నుంచి ఇరాన్ మీద అమెరికా ఆర్థిక ఆంక్ష‌లు అమ‌ల్లోకి రానున్నాయి. అప్ప‌టి నుంచి ఏ దేశం కూడా ఇరాన్ నుంచి ఒక్క చుక్క చుమురు దిగుమ‌తి చేసుకున్నా ఆంక్ష‌లు త‌ప్ప‌వ‌ని ట్రంప్ స‌ర్కార్ తేల్చి చెబుతోంది.

జ‌పాన్.. ద‌క్షిణ కొరియా.. ఈయూ లాంటి మిత్ర దేశాల‌కూ ఈ విష‌యంలో ఎలాంటి మిన‌హాయింపులు ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేసింది. ఒక‌వేళ అమెరికా చెప్పిన‌ట్లే ఇరాన్ మీద ఆంక్ష‌లు అమ‌లు అయిన ప‌క్షంలో.. ఇరాన్ నుంచి రోజూ ఉత్ప‌త్తి అయ్యే 25 ల‌క్ష‌ల పీపాల చ‌మురు లోటును భ‌ర్తీ చేసే సామ‌ర్థ్యం సౌదీ.. కువైట్‌.. యూఏఈ దేశాల‌కు ఉందా? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. ఏతావాతా చెప్పేదేమంటే.. న‌వంబ‌రు వ‌ర‌కూ ముడిచ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌టం ఖాయం. ఆ త‌ర్వాత మాత్రం ప‌రిస్థితులు చెప్ప‌లేమ‌న్న‌ది అంత‌ర్జాతీయ విశ్లేష‌కుల మాట‌. మ‌రి.. అంత వ‌ర‌కూ పెంచిన పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని త‌గ్గిస్తూ.. ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించే ఆలోచ‌న ఏమైనా ఉందా మోడీ..?