Begin typing your search above and press return to search.

మ‌న సొంత క్రిప్టోక‌రెన్సీ..పేరు బిట్‌కాయిన్ కాదు

By:  Tupaki Desk   |   14 Feb 2018 5:30 PM GMT
మ‌న సొంత క్రిప్టోక‌రెన్సీ..పేరు బిట్‌కాయిన్ కాదు
X
భార‌తదేశం మ‌రో సంచ‌ల‌నానికి సిద్ధ‌మైంది. బిట్‌ కాయిన్ సహా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వర్చువల్ కరెన్సీలు విజయవంతమవడంతో వాటికి దీటుగా సొంత క్రిప్టోకరెన్సీని రూపొందించేందుకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నగదు రహిత లావాదేవీల్లో రూపాయికి ప్రత్యామ్నాయంగా సొంత క్రిప్టోకరెన్సీని తీసుకొచ్చేందుకు గల అవశాలను ఆర్బీఐ నిపుణులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. లక్ష్మీ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ క్రిప్టోకరెన్సీని ఆవిష్కరించబోతున్నట్లు గతేడాది నుంచే వార్తలు వినిపిస్తున్నాయి.

క్రిప్టోకరెన్సీలకు అవసరమైన బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా సమాచారాన్ని మార్పిడి చేసుకునేందుకు వీలుగా వివిధ బ్యాంకులను - టెక్ సంస్థలను సమష్ఠిగా ముందుకు తీసుకురావడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌ బీఐ) ముందుంది. బ్లాక్‌ చైన్ టెక్నాలజీని ఉపయోగించుకుని సమాచారాన్ని మార్పిడి చేసుకోవడం ద్వారా మోసాలను అరికట్టడంతో పాటు మొండి బకాయిల సమస్యను పరిష్కరించుకునేందుకు వీలవుతుందని బ్యాంకులు అభిప్రాయపడుతున్నాయి. దీంతో వాటన్నింటిని కలసికట్టుగా ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఎస్‌బీఐ ఇప్పటికీ ఈ విషయమై ఐబీఎం - మైక్రోసాఫ్ట్ - స్కైలార్క్ - కేఎంపీజీ లాంటి దిగ్గజాలతో పాటు పది వాణిజ్య బ్యాంకులతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. క్రిప్టోకరెన్సీలకు చట్టబద్ధత లేదని, కనుక వాటిని ప్రభుత్వం గుర్తించబోదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పటికే పలుమార్లు ఉద్ఘాటించిన విషయం తెలిసిందే. అయితే క్రిప్టోకరెన్సీలకు తోడ్పాటునిస్తున్న బ్లాక్‌ చైన్ టెక్నాలజీని ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని ఆయన ప్రకటించారు. దీంతో రిజర్వు బ్యాంకు ఇప్పటికే ఈ అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, బిట్‌కాయిన్ సహా ఇతర క్రిప్టోకరెన్సీల పట్ల ప్రపంచ దేశాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నప్పటికీ మన దేశంలో వీటిని నిషేధించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించుకున్నట్లు స్పష్టమవుతున్నది. ఇదేగనుగ జరిగితే బిట్‌కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు, లావాదేవీలన్నీ చట్టవిరుద్ధమవుతాయి. క్రిప్టోకరెన్సీలు పన్నుల ఎగవేతకు దోహదం చేస్తున్నాయని ప్రభుత్వం భావిస్తున్నదని, అందుకే వీటిని నిషేధించేందుకు త్వరలో చట్టాన్ని తీసుకురాబోతున్నదని అధికార వర్గాలు తెలిపాయి.

క్రిప్టోకరెన్సీ కొనుగోళ్లపై సిటీ బ్యాంకు నిషేధంబిట్‌కాయిన్లతో పాటు ఇతర క్రిప్టోకరెన్సీల కొనుగోళ్లకు తమ డెబిడ్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించకుండా సీటీ ఇండియా (సిటీ బ్యాంకు) మంగళవారం నిషేధాన్ని విధించింది. వర్చువల్ కరెన్సీల పట్ల రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఆందోళనలను వ్యక్తం చేస్తుండటంతో ఈ చర్య చేపట్టిన సిటీ బ్యాంకు.. తమ ఖాతాదారులకు సందేశాన్ని పంపి ఈ నిషేధం గురించి తెలియజేసింది. బిట్‌కాయిన్లు సహా ఇతర క్రిప్టోకరెన్సీలు, వర్చువల్ కరెన్సీల కొనుగోలుకు తమ డెబిట్ - క్రెడిట్ కార్డులను అనుమతించరాదని నిర్ణయించినట్లు సిటీ ఇండియా ఆ సందేశంలో స్పష్టం చేసింది.