Begin typing your search above and press return to search.

ఇటలీని సేవ్ చేయటానికి రంగంలోకి దిగిన క్యూబా

By:  Tupaki Desk   |   23 March 2020 9:50 AM GMT
ఇటలీని సేవ్ చేయటానికి రంగంలోకి దిగిన క్యూబా
X
ఇటలీ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. అంత అందమైన దేశం.. ఇప్పుడు అక్కడి ప్రజల కళ్ల నుంచి కన్నీళ్లు సైతం ఎండిపోయాయి. కరోనా తాకిడికి పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు ఓకవైపు.. మరణించిన వారికి అంతిమ సంస్కారాల్ని చేసేందుకు సైతం సిబ్బంది దొరకని పరిస్థితితో పాటు.. దేశంలోని ప్రతి కుటుంబం కరోనా ప్రభావానికి పడినదే. చివరకు.. ఆ దేశ అధ్యక్షుడు సైతం కన్నీళ్లు పెట్టుకొని.. తన దేశాన్ని తాను కాపాడలేకపోతున్నట్లుగా భోరుమన్నాడు. అంత పెద్దాయన కన్నీళ్లు పెట్టుకోవటం చూసి.. ప్రపంచం సైతం అవాక్కు అయ్యిందే తప్పించి.. ఆ దేశానికి అండగా ఉంటామన్న మాట ఒక్కరి నోటి నుంచి రాని పరిస్థితి.

ఏ దేశానికి ఆ దేశం కరోనా దెబ్బకు కకావికలమై.. ఎవరికి వారు వారి దేశాన్ని రక్షించుకునే వేళ.. ఇటలీ వేదనను తగ్గించే సాహసం చేయలేరుగా? ఇలాంటివేళ.. తమను ఆదుకోవాలంటూ ఇటలీ చేసిన వినతికి క్యూబా ఓకే చెప్పింది. సాధారణంగా దక్షిణ అమెరికాలోని క్యూబాకు.. అమెరికా.. యూరోప్ దేశాలకు పడదు. ఒకరంటే ఒకరు ఇష్టపడరు. అలాంటిది తాము ఆపదలో ఉన్న వేళ.. తమనుఆదుకోవటానికి క్యూబా ఒప్పుకోవటమే కాదు.. ఇటాలియన్లకు వైద్యం చేసేందుకు డాక్టర్ల టీం ఒకటి తాజాగా ఆ దేశానికి చేరుకుంది.

వైద్యుల బృందానికి ఇటలీ డాక్టర్లు ఘనంగా స్వాగతం పలకటమే కాదు.. అత్యవసర వేళలో తమకు అండగా నిలిచేందుకు.. సాయం చేసేందుకు వచ్చిన వారిని తెగ మెచ్చుకుంటోంది. ఇప్పుడు తొలి టీం వచ్చిందని..రానున్నరోజుల్లో మరిన్ని టీంలు ఇటలీకి చేరుకుంటాయని చెబుతున్నారు. ఇటలీకి చేరుకున్నక్యూబా వైద్యులు.. తొలుత ఆ దేశంలో మరణాల్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత కరోనా కంట్రోల్ మీద ఫోకస్ చేస్తారని చెబుతున్నారు. ఏమైనా.. ప్రాణాల్ని పణంగా పెట్టి తమకు సంబంధం లేని దేశ ప్రజల్ని కాపాడేందుకు తరలి వచ్చిన క్యూబా డాక్టర్లు.. ప్రపంచానికి సరికొత్త స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పాలి.

ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. నిజానికి ఇటలీకి క్యూబాకు మంచి సంబంధాలు లేవు. ఆ మాటకు వస్తే.. క్యూబా మీద ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించిన సమయంలో ఆ తీర్మానాన్ని సమర్థించిన పన్నెండు దేశాల్లో ఇటలీ ఒకటి. అలాంటి దేశం.. ఈ రోజు తమను కాపాడాలని క్యూబాను వేడుకున్న వెంటనే ఆ దేశం స్పందించింది. గతంలో పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎబోలా విరుచుకుపడినప్పుడు కూడా క్యూబా వైద్యులు వెళ్లి.. వైద్యం చేసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడారు. తమను వ్యతిరేకించే దేశాన్ని సేవ్ చేసేందుకు ముందుకొచ్చిన క్యూబా వైద్యుల పెద్ద మనసుకు ప్రపంచం సలాం చేయాల్సిందే.