Begin typing your search above and press return to search.

కరోనాకు క్యూబా మందు

By:  Tupaki Desk   |   4 April 2020 4:30 PM GMT
కరోనాకు క్యూబా మందు
X
కరోనా దెబ్బకు అగ్రరాజ్యాలు కూడా గగ్గోలు పెడుతుంటే.. కొన్ని చిన్నచిన్న దేశాలు మాత్రం కరోనా కాదు దాని జేజెమ్మ వచ్చినా మాకేం భయం లేదంటున్నాయి. అందుకు కారణం ఆ దేశాల్లోని పటిష్ఠమైన ఆరోగ్య సేవల వ్యవస్థ - దేశాధినేతల మాటను జవదాటని ప్రజలు. కరోనాతో పోరుకు సై అంటున్న అలాంటి చిన్న దేశాల్లో క్యూబా ఒకటి. కరోనాలాంటివి ఎన్నొచ్చినా మాకు భయం లేదంటున్నారు క్యూబా వైద్యులు.

కరోనా లక్షణాలున్న ప్రయాణికులు ఉన్న నౌక ఒకటి సముద్రంలో వస్తుంటే దాన్ని నిలపడానికి ఏ దేశమూ అనుమతివ్వలేదు.. కానీ, క్యూబా మాత్రం మా రేవులో లంగరేసుకోండని చెప్పింది. అవును.. బ్రిటన్ నుంచి 682 మందితో వస్తున్న ఎంఎస్‌ బ్రాయిమార్‌ నౌకలో కొందరికి కరోనా లక్షణాలు కనిపించాయి. ఆ నౌకను అన్ని దేశాలూ తిప్పి పంపించాయి. కానీ, క్యూబా మాత్రం వారిని తమ దేశంలోకి రానిచ్చి వారికి కరోనా పరీక్షలు చేసి చికిత్స చేసింది.

క్యూబా సెంట్రల్ అమెరికా, కరీబియన్ ప్రాంతంలో ఒక చిన్న దేశం. జనాభా కోటి మంది ఉంటారు. ప్రపంచంలోనే వైద్యానికి ఇది పెట్టింది పేరు. ఇక్కడ ప్రతి 125 మందికి ఒక డాక్టరు ఉంటారు.. కరోనా మూడు నెలలుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నా ఈ దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసులు 300 కంటే తక్కువే. ఇంతవరకు ఆరుగురు చనిపోయారక్కడ.

కరోనాను కట్టడి చేయడానికి క్యూబా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ, మిలటరీ ఆసుపత్రులన్నిటిలోనూ కరోనా రోగుల చికిత్సకు ఏర్పాట్లు చేసింది. ప్రజలందరికీ టెస్టులు చేసేసింది. ఇందుకోసం వైద్య బృందాలను ఏర్పాటు చేసి టెస్టులు చేయించింది. పాజిటివ్ అని తేలితే వారిని వెంటనే ఆస్పత్రులకు షిప్ట్ చేసింది.వారి నుంచి ఇంకెవరికీ రాకుండా అడ్డుకుంది.

క్యూబా ఒకప్పుడు ఇలాంటి ఆరోగ్య విపత్తుతోనే అతలాకుతలమైంది. అంటువ్యాధులకు జనం పిట్టల్లా రాలిపోయారు. అమెరికా తో క్యూబాకు ఉన్న శత్రుత్వం వల్ల దాన్ని ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో క్యూబా కమ్యూనిస్టు దిగ్గజం ఫిడెల్‌ క్యాస్ట్రో తమ దేశంలోనే పెద్దఎత్తున వైద్యుల్ని తయారుచేయాలని నిశ్చయించారు. దేశాన్ని డాక్టర్ల ఫ్యాక్టరీగా మలిచారు. ఇప్పుడా దేశంలో ప్రతి 1000 మందికి సగటున 8 మంది డాక్టర్లున్నారు. పైగా ఇక్కడ డాక్టర్లు మిగతా దేశాల్లోని చాలామంది డాక్టర్లలా కాదు.. వీరికి నరనరాల్లో సేవాభావం ఉంటుంది. విశ్వవిప్లవకారుడు చేగెవేరా స్ఫూర్తితో వారంతా వైద్యసేవ చేస్తుంటారు.

ప్రపంచంలో ఎక్కడ విపత్తులు సంభవించినా.. మానవతా వాదానికి ప్రాధాన్యమిచ్చే క్యూబా పీడిత ప్రజల్ని కాపాడేందుకు ఎప్పుడూ ముందే ఉంటుంది. 2010లో హైతీ భూకంప బాధితులకు.. 2014లో ఎబోలా కోరల్లో చిక్కుకున్న పశ్చిమ ఆఫ్రికా ప్రజలకు అండగా నిలిచింది. జార్జిబుష్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికాపై కత్రినా హరికేన్‌ విరుచుకుపడింది. అప్పుడు ఆపన్నహస్తం అందించేందుకు క్యూబా పెద్ద మనసు తో ముందుకొచ్చినా.. చిన్నతనంగా భావించిన అగ్రరాజ్యపు అధికారులు అందుకు నిరాకరించారు. వైద్య సదుపాయాల్లేక ఇబ్బందిపడుతున్న బ్రెజిల్‌లో క్యూబా వైద్యులు ఎన్నో ఏళ్లుగా స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. 1960ల నుంచి క్యూబా డాక్టర్లు, స్పెషలిస్టులు డజన్లకొద్దీ వేర్వేరు దేశాల్లో సేవలు అందిస్తున్నారు. అంతెందుకు కరోనా ప్రబలిన తరువాత చైనాకు కూడా డాక్టర్లను పంపించింది క్యూబా. దాదాపు 77 దేశాల్లో 37,000 మంది క్యూబా డాక్టర్లు పనిచేస్తున్నారంటే వాళ్ల కమిట్‌మెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.