Begin typing your search above and press return to search.

పెట్టుబ‌డులు రావు.. కానీ ప్ర‌భుత్వం న‌డుస్తోంది ఎలా?

By:  Tupaki Desk   |   5 Nov 2021 10:30 AM GMT
పెట్టుబ‌డులు రావు.. కానీ ప్ర‌భుత్వం న‌డుస్తోంది ఎలా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుత ఆర్థిక ప‌రిస్థితి నానాటికీ దారుణంగా ప‌డిపోతుంది. అప్పులు తెచ్చి పాల‌న చేయాల్సిన దుస్థితి వ‌చ్చింద‌ని అటు ప్ర‌తిప‌క్ష పార్టీలు ఇటు ఆర్థిక నిపుణులు అధికార జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఆదాయం స‌రిప‌డా రాక‌పోయిన‌ప్ప‌టికీ న‌వ‌ర‌త్నాల పేరుతో ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ డబ్బులు పంచిపెడుతున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తూనే ఉన్నాయి. మ‌రోవైపు రాష్ట్రానికి కొత్త‌గా పెట్టుబ‌డులు రావ‌డం లేద‌ని ఏ సంస్థ‌తో ఒప్పందాలు కుద‌ర‌డం లేద‌ని అంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లోనూ ప్ర‌భుత్వం ఎలా సాగుతుంద‌ని? ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు ఎలా అమ‌లు చేస్తున్నార‌నే ప్ర‌శ్న‌లు రేకెత్తుతున్నాయి.

త‌న తండ్రి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాల‌న‌ను తిరిగి తెస్తాన‌ని రాజ‌న్న ప‌రిపాల‌న వ‌స్తుంద‌ని పాద‌యాత్ర‌లో చెప్పిన జ‌గ‌న్‌కు ప్ర‌జ‌ల‌కు ప‌ట్టం క‌ట్టారు. 2019 ఎన్నిక‌ల్లో 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు అందించి ఘ‌న విజ‌యాన్ని కట్ట‌బెట్టారు. అయితే ఎంతో న‌మ్మ‌కం పెట్టుకున్న జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల పేరుతో కొంత‌మంది ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే మేలు చేస్తున్నార‌ని మిగిలిన వాళ్ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మ‌రో వ‌ర్గం ప్ర‌జ‌ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్ట‌ని జ‌గ‌న్‌.. కేవ‌లం సంక్షేమ ప‌థ‌కాల‌పైనే ధ్యాస పెడుతున్నార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఏపీకి పెట్టుబ‌డులు రావ‌డం లేద‌ని అంత‌ర్జాతీయ సంస్థ‌లు రాష్ట్రంతో ఒప్పందం చేసుకోవ‌డానికి ముందుకు రావ‌డం లేద‌ని ఓ వ‌ర్గం తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తోంది. కానీ అప్పులు తెచ్చి మాత్రం సంక్షేమ ప‌థ‌కాల‌కు ఢోకా లేకుండా చూస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆదాయం వ‌చ్చే మార్గాల గురించి ప‌ట్టించుకోకుండా ఇలా అప్పులు తెచ్చి పంచి పెడుతుంటే ఎలా అని కూర్చ‌ని తింటే కొండ‌లైన క‌రుగుతాయ‌నే సామెత గుర్తు తెచ్చుకోవాల‌ని జ‌గ‌న్‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు.

అయితే వైసీపీ వ‌ర్గాలు మాత్రం ఈ విమ‌ర్శ‌ల‌ను తిప్పికొడుతున్నాయి. గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో న‌కిలీ ఎమ్ఓయూలు కుదుర్చుకుని తాత్కాలిక పెట్టుబ‌డి దారుల‌ను రాష్ట్రానికి తెచ్చార‌ని ఇప్పుడ‌వి లేవ‌ని వైసీపీ నాయ‌కులు అంటున్నారు. కానీ ఆ ఆరోప‌ణ‌లను టీడీపీ నేత‌లు ఖండిస్తున్నారు. ఇప్పుడు అది రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మైంది. కానీ వాస్త‌వంగా చూసుకుంటే ఏ రాష్ట్రంలోనైనా లేదా దేశంలోనైనా పెట్టుబ‌డులు వ‌స్తేనే అభివృద్ధి ప‌రుగులు పెడుతుంద‌నే విష‌యం తెలిసిందే. అందుకే అంత‌ర్జాతీయ సంస్థ‌లు త‌మ రాష్ట్రాల్లో కార్యాల‌యాలు పెట్టేలా ప‌రిశ్ర‌మ‌లు తెరిచేలా ఆయా నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తారు. కానీ ఇప్పుడు ఏపీలో మాత్రం పెట్టుబ‌డులు లేవ‌ని అభివృద్ధి సాధ్యం కాద‌ని అప్పులే మిగులుతాయ‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. త‌న న‌వ‌ర‌త్న ప‌థ‌కాలే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ పార్టీని గెలిపిస్తాయ‌ని న‌మ్మ‌కంతో ఉన్న జ‌గ‌న్‌.. రాష్ట్రానికి పెట్టుబ‌డులు వ‌చ్చే మార్గం కూడా చూడాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.