Begin typing your search above and press return to search.

ఇదెక్కడి ఆరాచకం.. కర్ఫ్యూ వేళ పోలీస్ స్టేషన్ ఎదుట కత్తులతో కేక్ కటింగ్

By:  Tupaki Desk   |   17 Jun 2021 1:30 PM GMT
ఇదెక్కడి ఆరాచకం.. కర్ఫ్యూ వేళ పోలీస్ స్టేషన్ ఎదుట కత్తులతో కేక్ కటింగ్
X
ఇప్పుడు చెప్పే ఉదంతం గురించి తెలిస్తే.. అవును.. బిహార్.. యూపీలలో ఇలాంటి ఆరాచకాలే చోటు చేసుకుంటాయని అనేస్తారు. కానీ.. ఈ ఉదంతం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో అంటే అవాక్కు అవ్వాల్సిందే. రాజకీయం పేరుతో కొందరు చేస్తున్న ఆరాచకానికి ఈ ఉదంతం ఓ చక్కటి ఉదాహరణ. పోలీసు వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపటమే కాదు.. తమకున్న ‘పవర్’ తో అధికారుల చేతుల్ని కట్టి పారేస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పే తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. కర్ప్యూ వేళ ఒక మాజీ కౌన్సిలర్ కొడుకు రాత్రి వేళ రోడ్డు మీద కేక్ కటింగ్ చేయటం వివాదంగా మారింది. అది కూడా పోలీస్ స్టేషన్ కు ఎదురుగానే ఈ హంగామా చేసిన వైనాన్ని తెలుసుకున్న వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకూ జరిగిందేమంటే..

ముమ్మిడివరంలోని మాజీ కౌన్సిలర్ తనయుడు దుర్గాప్రసాద్. తాజాగా అతడి పుట్టిన రోజును ఘనంగా జరుపుకోవాలని డిసైడ్ అయ్యాడు. కొవిడ్ నేపథ్యంలో రాత్రిళ్లు కర్ఫ్యూ విధిస్తున్న నేపథ్యంలో.. తనకున్న పలుకుబడిని స్నేహితులకు చూపించాలని నిర్ణయించుకున్నాడు. స్థానిక విష్ణు ఆలయం సెంటర్ లో బర్త్ డే వేడుకల్ని నిర్వహించాలని భావించి.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారు.

కొంతమంది యువకులు కత్తులు తెచ్చి తమ నాయకుడు దుర్గాప్రసాద్ కు ఇవ్వటం.. దాన్ని గాల్లో ఊపుతూ హడావుడి చేశారు. అనంతరం కేక్ ను ఆ భారీ తల్వార్ తో కట్ చేయించారు. అక్కడితో ఆగనివారు.. ర్యాలీగా రోడ్ల మీద వెళ్లారు. చేతిలో ఉన్న కత్తుల్ని గాల్లో ఊపుతూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హడావుడి చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదురుగా కారును నిలిపి.. దానిపై కేక్ పెట్టి తల్వార్ తో మరోసారి కేక్ కటింగ్ చేపట్టారు.

కాస్త ఆలస్యంగా సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ సురేశ్ అక్కడకు వెళ్లి.. వారిని చెదరగొట్టారు. కర్ఫ్యూ వేళలో చోటు చేసుకున్న ఈ హడావుడి షాకింగ్ గా మారింది. పోలీసు శాఖలోనూ భారీ చర్చకు తెర తీసింది. దీనిపై విచారణ జరుపుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఎస్ఐ కానీ కలుగజేసుకొని ఉండకపోతే.. ఈ హడావుడి మరింత సాగేదన్న మాట వినిపిస్తోంది.