Begin typing your search above and press return to search.

లెమ‌న్ ట్రీ హోట‌ల్లో వాట‌ర్ బాటిల్ రేటు అంతా?

By:  Tupaki Desk   |   14 Nov 2017 4:32 AM GMT
లెమ‌న్ ట్రీ హోట‌ల్లో వాట‌ర్ బాటిల్ రేటు అంతా?
X
వాట‌ర్ బాటిల్ రేటు ఎంత‌? రూ.18.. లేదంటే రూ.20. కొన్నిచోట్ల అద‌నంగా ఛార్జీలు విధించే అల‌వాటు ఉన్న క్ర‌మంలో రూ.25 వ‌ర‌కూ ప‌లుకుతుంది. ఈ మ‌ధ్య‌న హైద‌రాబాద్ లో లీగ‌ల్ మెట్రాల‌జీ శాఖ యాక్టివ్ అయ్యింది. ఇంత‌కాలం చూసీచూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే లీగ‌ల్ మెట్రాల‌జీ శాఖ‌కు కొత్త ఉత్సాహాన్ని. .ఉత్తేజాన్ని తీసుకొచ్చారు సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌.

పోలీసు అధికారి అయిన‌ప్ప‌టికీ.. పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌లో నెల‌కొన్న అవినీతికి చెక్ పెట్టేందుకు పోలీస్ ట్రీట్ మెంట్ అవ‌స‌ర‌మ‌ని భావించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఆ శాఖ ప‌గ్గాల‌తో పాటు లీగ‌ల్ మెట్రాల‌జీ (తూనిక‌లు కొల‌త‌ల శాఖ‌) విభాగం బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు. ఇప్ప‌టికే పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌ను సెట్ చేసిన సీవీ ఆనంద్ ఈ మ‌ధ్య‌నే లీగ‌ల్ మెట్రాల‌జీ మీద‌నే ఫోక‌స్ చేశారు. జీఎస్టీ పేరుతో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వ్యాపారుల ఆరాచ‌కాల‌పై ఆయ‌న త‌నిఖీల‌తో షాకిస్తున్నారు.

ఈ డ్రైవ్ లో భాగంగా హైద‌రాబాద్ లోని ప‌లు మాల్స్‌.. రెస్టారెంట్లు.. ఫైవ్ స్టార్ హోట‌ళ్లు.. పెద్ద పెద్ద వ‌స్త్ర దుకాణాలు.. చైన్ షాపుల మీద ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ సిరీస్ లో భాగంగా తాజాగా లెమ‌న్ ట్రీ ఫైవ్ స్టార్ హోట‌ల్లో త‌నిఖీలు నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా రూ.18 ఎమ్మార్పీ ఉన్న వాట‌ర్ బాటిల్ మీద వ‌సూలు చేస్తున్న మొత్తాన్ని చూసి షాక్ తిన్నారు. రూ.18 ఉన్న వాట‌ర్ బాటిల్ ధ‌ర‌ను రూ.100గా నిర్ణ‌యించి.. జీఎస్టీ క‌లిపి రూ.129 చేశారు. స‌ర్వీస్ టాక్స్ (వాట‌ర్ బాటిల్ ఇవ్వ‌టంలో చేసే స‌ర్వీస్ ఏంటో?) పేరిట మ‌రో ఆరు రూపాయిలు వ‌డ్డించి రూ.135 వ‌సూలు చేస్తున్నారు.

ఇలా ఒక్క వాట‌ర్ బాటిల్ మీద‌నే కాదు.. ఆహార ప‌దార్థాల మీద ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వ‌సూలు చేస్తున్న వ‌స్తువుల్ని సీజ్ చేసిన అధికారులు.. హోట‌ల్ యాజ‌మాన్యానికి మెమో జారీ చేశారు. వాట‌ర్ బాటిల్ ధ‌ర ఇంతా? అంటూ త‌నిఖీ అధికారులు సైతం అవాక్కు అయిన‌ట్లుగా చెబుతున్నారు.