Begin typing your search above and press return to search.

నానాటికి పెరిగిపోతున్న సైబర్ క్రైమ్ కేసులు ... సిబ్బందే లేరు !

By:  Tupaki Desk   |   30 Dec 2020 12:30 PM GMT
నానాటికి పెరిగిపోతున్న సైబర్ క్రైమ్ కేసులు ... సిబ్బందే లేరు !
X
సైబర్ క్రైమ్ .. ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. పెరుగుతున్న సైబర్ క్రైం కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. కానీ, అదేస్థాయిలో విచారణ జరపాల్సిన సిబ్బందిని మాత్రం కొరత వేదిస్తోంది. 2017లో 325 కేసులు..2018లో 428 కేసులు..2019లో 1393 కేసులు..2020 డిసెంబర్‌ నాటికి 2,456 కేసులు..ఒక్కమాటలో చెప్పాలంటే.. హైదరాబాద్‌లో పెరిగిన సైబర్‌ క్రైమ్‌ రేట్‌ సంగతి ఇది. రోజుకు వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి‌. కేసులను సమర్ధవంతంగా విచారించాల్సిన సిబ్బంది మాత్రం తక్కువగానే ఉన్నారు. హైదరాబాద్ సైబర్‌ క్రైమ్‌ కోసం 58 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. పదేళ్ల క్రితం నాటి కేటాయింపులతోనే సైబర్‌ క్రైమ్‌ స్టేషన్ నెట్టుకు వస్తుంది. దీంతో సిబ్బందిపై పనిభారం ఎక్కువగా ఉంది.

2010లో సైబర్‌ క్రైమ్‌ స్టేషన్ ‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దానికి ప్రాథమికంగా 40 మంది సిబ్బందిని కేటాయించడంతో పాటు.. రెండు సైబర్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్స్‌ ను ఏర్పాటు చేసింది. ఒక్కో టీమ్‌ కు ఇన్‌ స్పెక్టర్‌ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. ఆ టీమ్ ‌లో ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, పది మంది కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులను నియమించింది ప్రభుత్వం. పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఆ వ్యవస్థలో పెరిగిన సిబ్బంది సంఖ్య కేవలం ఎనిమిది మాత్రమే. సైబర్‌ నేరాలు కొత్తపుంతలు తొక్కుతున్న ఈ తరుణంలో తక్కువ మంది సిబ్బందితో ఉన్న ఆ శాఖ అల్లాడిపోతోంది. డెబిట్, క్రెటిట్‌ కార్డుల ఫ్రాడ్స్ ‌తో పాటు హ్యకింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. హైదరాబాద్‌ సిటీ సైబర్ క్రైమ్‌ స్టేషన్‌కు మరో 19 మంది సిబ్బందిని కేటాయించాలని కోరుతూ.. అధికారులు రెండేళ్ల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ముగ్గురు ఇన్‌స్పెక్టర్లతో పాటు ఆరుగురు ఎస్సైలు, పది మంది కానిస్టేబుళ్లను కోరారు. ఇప్పటివరకూ వాటికి మోక్షం కలగలేదు. వచ్చే ఏడాది అయినా దానికి మోక్షం కలుగుతుందేమో చూడాలి.