Begin typing your search above and press return to search.

రెంటర్స్ ను వదలని సైబర్ నేరగాళ్లు..!

By:  Tupaki Desk   |   11 Jan 2023 9:34 AM GMT
రెంటర్స్ ను వదలని సైబర్ నేరగాళ్లు..!
X
టెక్నాలజీతో ఎన్ని లాభాలు ఉన్నాయో అంతే నష్టం కూడా ఉంటుంది. చేతిలో స్మార్ట్ ఫోన్.. చౌకగా డేటా ప్లాన్.. వ్యాలెట్ లో డబ్బులు ఉంటే చాలు కోరుకున్నది మన కాళ్ళ దగ్గరకు వచ్చి చేరుతుంది. దీంతో కేటుగాళ్లు సైతం టెక్నాలజీని వాడుకుంటూ నయా మోసాలకు పాల్పడుతూ మన అకౌంట్లో డబ్బులు ఎంచక్క కాజేస్తున్నారు.

ఒకప్పుడు దొంగలను పట్టుకోవడం పోలీసులకు కష్టంగా మారేది. అయితే ఇంటర్నెట్.. సీసీ కెమెరాల లాంటి టెక్నాలజీ విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక దొంగలను పట్టుకోవడం వారికి ఈజీ అయింది. అయితే దొంగలు సైతం తెలివిగా టెక్నాలజీని వాడుతూ పోలీసులకు చిక్కకుండానే కొత్త తరహాలో మోసం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుర్తుతెలియని లింకులు.. డిస్కౌంట్ ఆఫర్స్.. లక్కీ డ్రా వంటివి ఆకర్షితులై మోసపోవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. అయితే సైబర్ కేటుగాళ్లు మాత్రం ఏ అవకాశాన్ని సైతం వదులుకోకుండా ప్రజలను లూటీ చేస్తున్నారు.

ఆఖరికి అద్దె ఇంటి కోసం చూసే వారిని వదలడం లేదు. ఆన్ లైన్లో అద్దె ఇల్లు కోసం వెతికే వారిని సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. అందం ఉన్న ఇంటి ఫోటోలు ఆన్ లైన్లో తక్కువ అద్దెకే ఇస్తామని నమ్మ బలికిస్తున్నారు. ఈ ఫోటోలను చూసి ఇల్లు నచ్చిందని ఎవరైనా ప్రకటనలో ఉన్న నెంబరును సంప్రదిస్తే అడ్వాన్స్ కింద డబ్బులు చెల్లించమని అడుగుతున్నారు.

ఇల్లు చూశాక ఇస్తామని చెబితే మీ కంటే ముందే ఎవరైనా వచ్చి అడ్వాన్స్ ఇస్తే వారికి ఇచ్చేస్తామని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో తమకు కావాల్సిన ఏరియాలో.. తక్కువ ధరలో అద్దె ఇల్లు దొరుకుతుందో లేదనని కొందరు వారు చెప్పినట్లుగానే అడ్వాన్సు ఇస్తున్నారు. ఆ తర్వాత ఆ ప్రకటనలో ఉన్న ఇంటికి వెళ్లి ఫోన్ చేస్తూ ఎవరూ అందుబాటులో లేకుండా పోతున్నారు. దీంతో తాము మోసపోయామని పలువురు సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ పోలీసులు నకిలీ ప్రకటనలు చూసి మోసపోవద్దని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఆన్ లైన్లో ఇద్దె ఇల్లు చూసిన వాళ్లు నేరుగా ఇంటికి వెళ్లి చూశాక గానీ డబ్బులు ఇవ్వొద్దని సూచిస్తున్నారు. ఆన్ లైన్లో మోసానికి గురైనట్లు భావిస్తే డయల్ 1930కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరుతున్నారు. ఆన్ లైన్ ప్రకటనలను గుడ్డిగా నమ్మవద్దని.. జాగురూకతతో ఉండాలని సూచిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.