Begin typing your search above and press return to search.

సైబర్ మోసం.. మనకు తెలియకుండానే రుణాలు

By:  Tupaki Desk   |   16 Nov 2019 10:54 AM GMT
సైబర్ మోసం.. మనకు తెలియకుండానే రుణాలు
X
పోయిన సంవత్సరం తమిళ హీరో విశాల్ నటించిన 'అభిమన్యుడు' సినిమా చూశారా.. అందులో బ్యాంకు రుణం కోసం విశాల్ తండ్రి దగ్గర అన్ని పత్రాలు తీసుకున్న మోసగాళ్లు వీరి రుణం మంజూరు చేయించి 10 లక్షలు వీరి ఖాతాల్లో పడగానే ఆ సొమ్మును కొట్టేస్తారు. ఇప్పుడు అచ్చంగా అలాంటి కొత్త సైబర్ నేరం వెలుగుచూసింది.

సైబర్ నేరగాళ్లు.. ఎప్పుడు ఎలా కొత్తగా కొట్టేయాలో వారికి బాగా తెలుసు. ఇన్నాళ్లు అమాయకులైన వారికి ఫోన్ చేసి వారి బ్యాంకుల్లోని డబ్బులను కొల్లగొట్టేవారు. ఇప్పుడు బ్యాంకులు, ఆర్బీఐ సహా ఖాతాదారులు తెలివికి రావడంతో రూటు మార్చారు. అసలు వ్యక్తులకు తెలియకుండానే వారి పేరు తో రుణాలు పొందుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ తరహా మోసం ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తోంది.

ఉద్యోగులు, రుణాలు కావాల్సిన వారు వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు దరఖాస్తు చేస్తుంటారు. అయితే బ్యాంకులు, సంస్థలు సవాలక్ష కారణాలు చూపించి వారికి రుణాలివ్వకుండా మోసంచేస్తాయి. అయితే వీరు దరఖాస్తు చేసుకున్న పత్రాలను మాత్రం తిరిగి ఇవ్వవు. ఇప్పుడు ఆ డేటా ను కొందరు అక్రమార్కులు అమ్ముకుంటున్నారు. అవి సైబర్ మోసగాళ్లకు చేరి మన పేరిట ఫొటో, అడ్రస్ మార్చి నేరగాళ్లు లక్షల రుణాలు తీసుకొని ఎగ్గొడుతున్నారు. చివరకు మనం రుణం తీసుకోకుండానే మనల్ని డబ్బులు కట్టాలని సదురు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కోరడం తో ఈ విషయం వెలుగు చూస్తోంది.

తాజాగా ఢిల్లీ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు హిమాన్షు, గౌరవ కుమార్, దీపక్ కుమార్ అనే ముగ్గురు ఇలా హైదరాబాద్ కు చెందిన ఇద్దరి పేరిట ఢిల్లీ లో రుణం తీసుకున్నారు. ఒకరి పేరుపై 13 లక్షలు, మరొకరి పేరుపై 10 లక్షలు లోన్ తీసుకొని ఎగ్గొట్టారు. బాధితుల కు ఫోన్లు చేసి రుణం కట్టాలని అడగడంతో తాము తీసుకోలేదని వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ సైబర్ నేరగాళ్ల పని అని పోలీసులు తేల్చి తాజాగా ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు.వీరు ఇలా ఇప్పటికే 73 లక్షలు కొల్లగొట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ సైబర్ నేరగాళ్లు.. వివిధ బ్యాంకులు, డేటా ప్రొవైడర్స్ ను సంప్రదించి విలువైన వ్యక్తుల డేటాను కొంటున్నారు. ఆధార్, పాన్ కార్డుల జిరాక్స్ లు సంపాదించి రుణాలు తీసుకొని రెండు నెలలు కట్టి ఎగ్గొడుతున్నారు. దీంతో అసలు బాధితులు బలైపోతున్నారు. దీనిపై హైదరాబాద్ పోలీసుల కు ఫిర్యాదులు రావడంతో వారు పరిశోధించ గా సైబర్ నేరగాళ్లు చిక్కారు. చివరకు వీరి ఆట కట్టైంది.