Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో అతి పెద్ద సైబర్ మోసం.. రూ.11.68 కోట్లు దోచేశారు

By:  Tupaki Desk   |   6 Aug 2021 3:28 AM GMT
హైదరాబాద్ లో అతి పెద్ద సైబర్ మోసం.. రూ.11.68 కోట్లు దోచేశారు
X
వినేందుకు వెటకారంగా ఉంటుంది కానీ ఇది నిజం. ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత అతి పెద్ద సైబర్ మోసం తాజాగా హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. ఎదుటివారి ఆశను తమకు అనుకూలంగా మార్చుకోవటం.. వారి నుంచి భారీ ఎత్తున డబ్బుల్ని కొట్టేసే విషయంలో సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. తాజాగా అలాంటి ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. నేరం జరిగిన విధానం పాతదే అయినా.. కొత్తగా మాటలు చెప్పి మోసం చేయటం.. ట్రాప్ లో దిగేందుకు అవసరమైన డ్రామాను నడిపించటం ఇందులో కనిపిస్తుంది. తాజా మోసంలో బాధితుడి నుంచి ఏకంగా రూ.11.68 కోట్లు దోచేసిన వైనం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఇంతకూ జరిగిందేమంటే..

హైదరాబాద్ కు చెందిన 82 ఏళ్ల డాక్టర్ చంద్రశేఖర్ రావు అమెరికాలో స్థిరపడ్డారు. ప్రతి ఏడాది అమీర్ పేటలోని తన ఇంటికి వచ్చివెళుతుంటారు. ఇదే క్రమంలో ఈ ఏడాది మార్చిలో అమెరికా నుంచి వచ్చి ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆయనకు బెంజిమెన్ అనే పేరుతో సైబర్ నేరస్తుడు ఒకడు ఈమొయిల్ పంపాడు. అందులో తాను బ్రిటన్ లోని ప్రముఖ ఫార్మా కంపెనీ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు.

జంతువులకు కరోనా రాకుండా ఉండేందుకు అమెరికా.. బ్రిటన్ లో భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ జరుగుతోందని.. అందుకు అవసరమైన ఆగ్రో మెటాజైన్ అనే ఆయిల్ టీకాల్లో ముడి పదార్థంగా వినియోగిస్తారని పేర్కొన్నారు. దీన్ని భారత్ లోని రాయగఢ్ చెందిన కంపెనీ తయారు చేస్తోందని పేర్కొన్నారు. ఆ నూనె ధర కేజీ రూ.10లక్షలుగా పేర్కొన్నారు. దాన్ని మీరు కొని మాకు ఇస్తే రూ.17లక్షలకు కొనుగోలు చేస్తామని.. తమకు మొత్తం పది కేజీల నూనె అవసరమని చెప్పిన వారు తర్వాత 350కేజీలు అవసరమని పేర్కొన్నారు.

దీంతో ఆశ పడిన పెద్ద మనిషి వెంటనే ఈ డీల్ కు ఓకే చెప్పారు కానీ.. ఉత్తినే కేజీకి రూ.7లక్షల భారీ మొత్తాన్ని అంత పెద్ద కంపెనీ ఎందుకు మిస్ చేసుకుంటుంది? అన్న చిన్నపాటి లాజిక్ మిస్ అయ్యారు. సైబర్ నేరస్తుడి ఉచ్చులో చిక్కుకున్న పెద్దాయన్ను ఆయిల్ కంపెనీ యజమాని అంటూ ఒక మహిళను పరిచయం చేశారు. ఇదంతా ఆన్ లైన్ లో జరుగుతున్నా.. ఒకరికొకరు ముఖముఖాల్ని చూసుకోకపోవటం గమనార్హం. కేవలం నమ్మకంతో ఇదంతా జరిగిపోయే పరిస్థితి.

నూనెను కొనోగులు చేసేందుకు సదరు మహిళ చెప్పిన బ్యాంకు ఖాతాలకు దశల వారీగా డబ్బులు చెల్లించారు. ఇది కాస్తా రూ.11.68 కోట్ల వరకు వెళ్లింది. డబ్బులు బ్యాంకుల్లో వేయటమే కానీ నూనె రాకపోవటం.. వారు చెప్పినట్లుగా లాభాలు రాని పరిస్థితి. మరింత మొత్తం బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయాలని డిమాండ్ చేయటంతో అనుమానం వచ్చి సైబర్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఇప్పటివరకు వెలుగుచూసిన సైబర్ నేరాల్లో ఇదే అత్యధిక మొత్తమని హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సంయుక్త కమిషనర్ (క్రైం) అవినాష్ మహంతి పేర్కొన్నారు. నిందుల బ్యాంకు ఖాతాల్ని గుర్తించిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.