Begin typing your search above and press return to search.

వాళ్లే మాపై ముందు దాడి చేసారు..ఎన్ కౌంటర్‌ పై సజ్జనార్ ఏంచెప్పారంటే..!

By:  Tupaki Desk   |   6 Dec 2019 11:55 AM GMT
వాళ్లే మాపై ముందు దాడి చేసారు..ఎన్ కౌంటర్‌ పై సజ్జనార్ ఏంచెప్పారంటే..!
X
వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసు నిందితులని ఎందుకు ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ కొద్దిసేపటి క్రితం మీడియాకి వివరించారు. దిశ కిడ్నాప్ - అత్యాచారం - హత్య కేసులో మొదట ఎలాంటి క్లూ లభించకుండా విచారణ ప్రారంభించామని.. అనేక కోణాల్లో కేసును విచారించిన తరువాత ఒక క్లూ తో నిందితులు మహమ్మద్ ఆరిఫ్ - జొల్లు శివ - జొల్లు నరేష్‌ - చింతకుంట చెన్నకేశవులను అరెస్ట్ చేసాము అని చెప్పారు. ఆ తరువాత నలుగురు నిందుతులని నవంబర్ 30వ తేదీన షాద్‌ నగర్ పీఎస్‌ లోనే మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాం.. రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించామన్నారు. అనంతరం కేసులో లోతైన విచారణ కోసం పోలీసు కస్టడీకి మెజిస్ట్రేట్ ఇచ్చారని తెలిపారు. 4వ తేదీన చర్లపల్లి జైలు నుంచి నిందితులను కస్టడీలోకి తీసుకున్నామన్నారు.

విచారణలో భాగంగా ఘటన జరిగిన స్థలంలో నిందితులు ఫోన్‌ తో పాటు మరికొన్ని కీలక ఆధారాలు దాచిపెట్టినట్లు చెప్పారు. దీనితో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలానికి ఆ నలుగురు నిందుతులని తీసుకోని వచ్చామని తెలిపారు. ఆ ఆధారాలని సేకరించే సమయంలో వారు నలుగురు కలిసి గుంపుగా దాడి చేయడం మొదలుపెట్టారు. అలాగే ఈ కేసులో A1 గా ఉన్న ఆరిఫ్ - అలాగే చెన్నకేశవులు పోలీసుల వద్ద గన్స్ లాక్కుని ఫైర్ చేశారని చెప్పారు. లొంగిపొమ్మని చెప్పినా నిందితులు వినలేదు అని - ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారు అని తెలిపారు. తరువాత కొద్దిసేపటికి కాల్పులు ఆగిపోయాయని.. వెళ్లి చూస్తే నలుగురు చనిపోయి ఉన్నారని చెప్పుకొచ్చారు సీపీ సజ్జనార్.

ఆ నలుగురు నిందితులను ఘటనా స్థలానికి తీసుకువచ్చినప్పుడు 10 మంది పోలీసులు ఉన్నారని..వారు జరిపిన కాల్పుల్లో ఓ ఎస్సైతో పాటు కానిస్టేబుల్‌ కు గాయాలైనట్టు తెలిపారు. గాయపడిన పోలీసులకి దగ్గర్లోని ఆసుపత్రిలో చికిత్స చేపించి ..మెరుగైన వైద్యం కోసం కేర్ ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు. అలాగే ఈ ఎన్‌ కౌంటర్ ఉదయం 5:40 నుంచి 6:30 మధ్య జరిగిందని స్పష్టం చేశారు. ఎన్ని రౌండ్ల ఫైరింగ్ జరిగింది అనేది విచారణలో తేలుతుంది అని , ఈ నలుగురు చాలా కరుడుగట్టిన నేరస్తులని తెలిపారు. వీరి నేర చరిత్రపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అలాగే దిశ తల్లిదండ్రుల ప్రైవసీని కాపాడాలని - ఎవరు కూడా వారి వద్దకి వెళ్ళకండి అని ఆయన చెప్పారు. కాగా , ఈ ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ అత్యవసర దర్యాప్తునకు ఆదేశించింది.