Begin typing your search above and press return to search.

ఈ ‘‘రోను’’ ఏపీని ఏ దరికి చేరుస్తుందో..?

By:  Tupaki Desk   |   19 May 2016 5:08 AM GMT
ఈ ‘‘రోను’’ ఏపీని ఏ దరికి చేరుస్తుందో..?
X
హుదూద్ పేరు విన్నప్పుడు చాలామంది మాదిరే ఏపీ ప్రజలు కూడా పెద్దగా ఫీల్ కాలేదు. కానీ అది కాస్తా తన విశ్వరూపం చూపించిన తర్వాత మిగిలిన వాళ్ల సంగతి ఎలా ఉన్నా.. దాని ధాటికి తీవ్రంగా ప్రభావితమైన ఉత్తరాంధ్ర ప్రజలు.. మరి ముఖ్యంగా విశాఖ వాసులు తమ జీవితంలో మర్చిపోలేని అనుభవాల్లో ఒకటిగా నిలిచిపోయింది. హుదూద్ తర్వాత తుపాను పేరు వింటే చాలు ఒక్కసారి ఉలిక్కిపడే పరిస్థితి. రోహిణికార్తె ఎండల్లో వచ్చిన తాజా తుపానును ‘రోను’గా డిసైడ్ చేశారు. చెన్నై నుంచి ఏపీకి షిఫ్ట్ అయిన ఈ ఆల్పపీడనం తుపానుగా మారింది.

తొలుత ఉత్తరదిశగా కదిలిన ఈ వాయుగుండం.. తర్వాత తన దిశను మార్చుకుంటూ ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ మచిలీపట్నం తీరానికి చేరువైంది. గురువారం తుపానుగా మారి ఉత్తర దిశగా బంగాళా ఖాతం తీరం వెంట కదులుతుందని చెబుతున్నారు. శుక్రవారానికి ఆంధ్ర..ఒడిశా తీరానికి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్న ఈ తుపాను కారణంగా ఏపీ ఇప్పుడు గజగజ వణికిపోయే పరిస్థితి. ఈ తుపానుకారణంగా గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయటమే కాదు.. కొన్నిప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుందని చెబుతుననారు.

తాజాగా చోటు చేసుకున్న వాతావరణం నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు. అధికారులతో సమీక్షను చేపట్టారు. అధికారులంతా అలెర్ట్ గా ఉండాలని చెప్పారు. రోను తుపాను కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడటంతో పాటు.. అన్ని జిల్లా కేంద్రాల్లో.. డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకు తగ్గట్లే అధికారులు ఏర్పాటు చేశారు. విపత్తు సహాయక బృందాన్ని రంగంలోకి దింపి అవసరానికి తగ్గట్లుగా సాయం చేసేందుకు వీలుగా సన్నద్ధం చేశారు. మరి..ఏపీని రోను ఎంత విధ్వంసం చేసి వెళుతుందో చూడాలి.