Begin typing your search above and press return to search.

డీఎస్ కేరాఫ్ అనూహ్య గంద‌ర‌గోళం

By:  Tupaki Desk   |   18 Dec 2018 5:28 PM GMT
డీఎస్ కేరాఫ్ అనూహ్య గంద‌ర‌గోళం
X
తెలంగాణ అసెంబ్లీకి ముంద‌స్తు ఎన్నిక‌ల ఫ‌లితం అనేక‌మంది నాయ‌కుల రాజ‌కీయ భ‌విష్య‌త్‌ ను ప్ర‌శ్నార్థకం చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌హామ‌హులు అనుకున్న ఎంద‌రో నేత‌లు మ‌ట్టిక‌రిచారు. త‌దుప‌రి ఏం చేయాలో పాలుపోని స్థితికి చేరారు. అలా ప్ర‌స్తుతం వార్త‌ల్లో నిలుస్తున్నారు ఎంపీ - సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్‌. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ అనుచరులంతా టీఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌ లో చేరగా - ప్రస్తుతం వారిలో అనేకమంది తీవ్ర అంతర్మథనానికి లోనవుతున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో తిరిగి తెరాస అధికారంలోకి వచ్చిన దరిమిలా తమ రాజకీయ భవితవ్యం ఎలా ఉంటుందోనని పలువురిలో ఆందోళన గూడుకట్టుకున్నట్టు స్పష్టమవుతోంది. ఎప్పటిలాగే తాము తెరాసలోనే కొనసాగి ఉంటే - అధికార పార్టీకి చెందిన నాయకులు - కార్యకర్తలుగా చెలామణి అయ్యేందుకు ఆస్కారం ఉండేదని అభిప్రాయపడుతున్నారు. తెరాసలో అసమ్మతి నేతగా ముద్రపడిన డీఎస్ మాత్రం ఇంకా పార్టీ సభ్యత్వానికి - తన పదవికి కానీ రాజీనామా చేయకుండా వ్యూహాత్మకంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఒకవేళ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే డీఎస్ ఏదైనా కీలక నిర్ణయం తీసుకునేందుకు ఆస్కారం ఉండేదని - ప్రస్తుతం తెరాసయే తిరిగి మరింత భారీ మెజార్టీతో అధికార పీఠాన్ని దక్కించుకోవడం వల్ల డీఎస్‌ కు తన రాజ్యసభ పదవిని కాపాడుకోవడం మినహా మరో ప్రత్యామ్నాయం లేకుండాపోయిందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

దాదాపు ఆరు నెల‌ల క్రితం డీఎస్‌పై నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన తెరాస ప్రజాప్రతినిధులంతా తీవ్రమైన నిందారోపణలు మోపుతూ అధిష్టానానికి ఫిర్యాదు లేఖ పంపారు. డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున అతనిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని సిఫార్సు చేశారు. అయితే ఈ లేఖ విషయమై తెరాస అధినేత కేసీఆర్ ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అదే సమయంలో డీఎస్ కూడా వేచిచూసే ధోరణిని అవలంభిస్తూ, తన రాజ్యసభ పదవికి ఎసరు రాకుండా చూసుకుంటున్నారు. డీఎస్ తనంతట తాను రాజీనామా చేసి ఏదైనా ఇతర పార్టీలో చేరితే - తెరాస తరఫున చేపట్టిన రాజ్యసభ పదవిని వదులుకోవాల్సిన ప్రమాదం తలెత్తే అవకాశం ఉండడం వల్లే డీఎస్ తెరాస సభ్యత్వానికి రాజీనామా చేయడం లేదని భావిస్తున్నారు. మరోవైపు డీఎస్‌ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే ఆయన రాజ్యసభ పదవిలో యథాతథంగా కొనసాగేందుకు వీలు కల్పించినట్లవుతుందనే ఉద్దేశ్యంతో తెరాస అధిష్టానం కూడా ఈ వ్యవహారంలో మౌనంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో డీఎస్ అనుచరులంతా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. డీఎస్ కూడా కాంగ్రెస్‌ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే ప్రచారం తెరపైకి వచ్చినప్పటికీ, ప‌ద‌వి కోణంలో ఆయన చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఒకవేళ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చని భావించారు. దీనికి సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోనూ ఢిల్లీలో భేటీ అయి మంతనాలు జరిపారు. వ్యూహాత్మకంగా తన అనుచరులందరినీ కాంగ్రెస్‌లో చేర్పించి, ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తాను కూడా తెర వెనుక ప్రయత్నాలు చేసినట్టు ప్రచారం జరిగింది.

అయితే, ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ జ‌రిగింది. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని, తెరాస తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడంతో డీఎస్ రాజకీయ భవితవ్యం కూడా ప్రశ్నార్ధకంగా మారింది. ఆయనతో పాటు తెరాసను వీడిన ఆయన అనుచరులు కూడా ప్రస్తుతం తమ రాజకీయ భవితవ్యాన్ని తల్చుకుని పలువురు అంతర్మథనం చెందుతున్నారని తెలుస్తోంది. ప్రత్యేకించి నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాలకు చెందిన వారంతా పరిస్థితులు మళ్లీ ఎప్పుడు కుదుటపడతాయోనని మథనపడుతున్నారు. రాజ్యసభ పదవీ కాలం మరో రెండేళ్లకు పైగా ఉన్నందున డీఎస్ మాత్రం ఇప్పట్లో తెరాసకు రాజీనామా చేసే అవకాశం ఎంతమాత్రం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఆయ‌న విష‌యంలో మ‌రికొద్ది కాలం వేచి చూసిన త‌ర్వాత టీఆర్ఎస్ పార్టీ త‌గు చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.