Begin typing your search above and press return to search.

డీఎస్ ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి...

By:  Tupaki Desk   |   29 Aug 2015 5:33 PM GMT
డీఎస్ ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి...
X
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చింది ధర్మపురి శ్రీనివాస్ అట. ఈ విషయం ఎవరికైనా తెలుసా? స్వయంగా ఆయనే చెప్పుకొన్నాడు. 2004లోనూ 2009లోనూ ఏపీలో కాంగ్రెస్ ను అధికారంలోకి ఆయనే తీసుకొచ్చాడట. కాంగ్రెస్ పార్టీ చివరికి ఆయనకు ఆవేదనే మిగిల్చిందట. బుల్డోజ్ చేసిన ఊరకుండిపోయానని ఆయన చెబుతున్నారు.

2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం. అప్పట్లో డీఎస్ పీసీసీ చీఫ్ గా ఉన్నమాట కూడా వాస్తవం. అయితే, అప్పటి కాంగ్రెస్ గెలుపునకు రెండు కారణాలు.. ఒకటి అప్పటికే అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడి నియంతృత్వం.. పాలనా వైఫల్యం. రెండోది.. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజాదరణ. ఆ రెండూ కలిసి అప్పట్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చాయి. అప్పట్లో డీఎస్ యాదృచ్ఛికంగా పీసీసీ చీఫ్ గా ఉన్నారంతే. ఇక, 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే దానికి పూర్తి క్రెడిట్ వైఎస్ రాజశేఖర రెడ్డిదే. 2004లో ఒక ఐదు శాతమో పది శాతమో డీఎస్ కు క్రెడిట్ ఉంటుందేమో కానీ 2009లో ఆ మాత్రం కూడా ఆయనకు ఉండదు. ఎందుకంటే ఆ ఎన్నికల్లో ఆయన స్వయంగా ఓడిపోయాడు.

ఒకవేళ ఆ ఎన్నికల్లో డీఎస్ గెలిచి ఉంటే ఆయన భవిష్యత్తు, ఏపీ భవిష్యత్తు కూడా భిన్నంగా ఉండి ఉండేది. రోశయ్య తర్వాత బీసీ, తెలంగాణ కేటగిరీలో ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు. కానీ ఆయనను దురదృష్టం వెంటాడి స్వయం కృతాపరాథంతో ఓడిపోయాడు. ఇక ఆయన నేరుగా కాంగ్రెస్ పార్టీకి కానీ రాష్ట్రానికి కానీ చేసింది కూడా ఏమీ లేదని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు. ఆయన ఇంట్లో కూర్చుని ఫోన్ పట్టుకుని ఫిర్యాదులు చేయడంతోనే ఆయన జీవితమంతా గడిచిపోతుందని, అలాగే ఆయన ఉన్నత స్థానానికి వచ్చారని, ఇప్పుడు తాను గొప్పవాడినంటూ కాంగ్రెస్ ను ఆడిపోసుకుంటున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు.