Begin typing your search above and press return to search.

కవిత పేరు చెప్పి కేసీఆర్ కు డీఎస్ స‌వాల్‌!

By:  Tupaki Desk   |   4 Sep 2018 10:01 AM GMT
కవిత పేరు చెప్పి కేసీఆర్ కు డీఎస్ స‌వాల్‌!
X
సీనియ‌ర్ నాయ‌కుడిగా సుప‌రిచితుడు..సీరియ‌స్ గా ఉంటూ ముక్కుసూటిగా మాట్లాడ‌తార‌న్న పేరున్న నేత‌గా డీఎస్ అంద‌రికి తెలుసు. సుదీర్ఘ‌కాలం కాంగ్రెస్ లో ఉన్న ఆయ‌న టీఆర్ ఎస్ లో చేర‌టం తెలిసిందే. అయితే.. ఆయ‌న పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాలంటూ పార్టీ అధినేత కేసీఆర్ కు తీర్మానం పంపారు. ఇంత‌కూ ఆ తీర్మానం పంపింది మ‌రెవ‌రో కాదు.. కేసీఆర్ కుమార్తె క‌మ్ ఎంపీ క‌విత‌.

నేరుగా క‌వితే తీర్మానాన్ని పంప‌కున్నా.. పార్టీ నేత‌ల చేత పంపించ‌టం అంద‌రికి తెలిసిందే. కేసీఆర్ కుమార్తెకు న‌చ్చ‌ని నేత పార్టీలో ఉండ‌టం సాధ్య‌మా? డీఎస్ మీద వేటు ప‌డ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపించింది. అయితే.. కేసీఆర్ మైండ్ తెలిసిన డీఎస్ తో పాటు.. కొంద‌రు ఈ వ్య‌వ‌హారం ఏమీ జ‌ర‌గ‌ద‌ని తేల్చారు. అందుకు త‌గ్గ‌ట్లే ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా ఉన్నారు.

త‌న భ‌విష్య‌త్ రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ కోసం ఇటీవ‌ల కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అయిన డీఎస్ ను.. మీరెటు వెళితే.. మేం కూడా అటేనంటూ తేల్చి చెప్పిన వేళ‌.. ఆయ‌న నిర్ణ‌యం ఏమై ఉంటుంద‌న్న సందేహం ప‌లువురిలో వ్య‌క్త‌మైంది. ఇదిలా ఉంటే..ఆయ‌న కాంగ్రెస్ కు తిరిగి వెళ్లిపోతార‌న్న మాట బ‌లంగా వినిపించింది. ఇలాంటి వేళ‌.. ఊహించ‌ని రీతిలో డీఎస్ నుంచి షాకింగ్ వ్యాఖ్య‌లు వ‌చ్చాయి.

టీఆర్ ఎస్ త‌న‌పై ప‌గ‌ప‌ట్టింద‌ని ఆరోపించిన డీఎస్.. త‌న‌పైన వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని చెబుతూ.. తాజాగా పార్టీని ఉద్దేశిస్తూ బ‌హిరంగ లేఖ రాశారు. పార్టీ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌కు తాను పాల్ప‌డిన‌ట్లుగా పేర్కొన‌టం త‌న‌ను బాధ‌కు గురి చేసిన‌ట్లుగా చెప్పిన ఆయ‌న‌.. తాను ఏ త‌ప్పూ చేయ‌లేద‌న్నారు.

త‌న‌ప‌ట్ల ఇష్టం లేకుంటే త‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని కేసీఆర్ కు స‌వాలు విస‌ర‌టం గ‌మ‌నార్హం. కేసీఆర్ కుమార్తె క‌విత‌కు.. మిగిలిన పార్టీ నేత‌ల‌కు తానంటే ఇష్టం లేకుంటే త‌న‌ను పార్టీ నుంచి తీసివేయాల‌న్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణ కోసం స‌మైక్య‌వాదుల‌కు వ్య‌తిరేకంగా తాను పోరాడిన విష‌యాన్ని గుర్తు చేశారు.

కేసీఆర్ డిప్యూటీ స్పీక‌ర్ గా ఉన్న రోజుల్లో తాను తెలంగాణ త‌ప్పించి వేరే ప్ర‌త్యామ్నాయం లేద‌ని చెప్పాన‌ని.. తన కుమారుడు అర‌వింద్ బీజేపీలో చేర‌తాడ‌న్న విష‌యాన్ని కేసీఆర్ కు ముందే చెప్పిన‌ట్లుగా ప్ర‌క‌టించారు.

త‌న అనుచ‌రుల‌ను బీజేపీలోకి వెళ్ల‌మ‌ని తాను ఎప్పుడూ చెప్ప‌లేద‌న్నారు. త‌న మ‌రో కొడుకు సంజ‌య్ విష‌యంలో టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ట్లుగా పేర్కొన్నారు. త‌న కొడుకు సంజ‌య్ ను అక్ర‌మంగా అరెస్ట్ చేశార‌న్నారు. త‌న 50 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా వ్య‌వ‌హ‌రించాన‌ని పేర్కొన్నారు. మొత్తానికి త‌న లేఖ‌తో కేసీఆర్ కు డీఎస్ భారీ స‌వాలే విసిరిన‌ట్లుగా చెప్పాలి. కుమార్తె సిపార్సు చేసిన త‌ర్వాత కూడా స్పందించ‌ని కేసీఆర్‌.. తాజాగా డీఎస్ రాసిన లేఖ‌కు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.