Begin typing your search above and press return to search.

ప్రశ్నలు వేయటం కూడా ఇరికించటమేనా డీఎస్‌సాబ్‌..?

By:  Tupaki Desk   |   2 July 2015 8:57 AM GMT
ప్రశ్నలు వేయటం కూడా ఇరికించటమేనా డీఎస్‌సాబ్‌..?
X
సుదీర్ఘకాలం పాటు ఒక విధమైన అలవాట్లు ఉన్న వ్యక్తి ఒక్కసారిగా తన అలవాటును మార్చుకుంటే ఎంత ఇబ్బందో తాజాగా డీఎస్‌కు అర్థమైనట్లుంది. సుదీర్ఘకాలంపాటు కాంగ్రెస్‌ పార్టీతో అనుబంధం ఉన్న ఆయన తాజాగా ఆ పార్టీతో తెగతెంపులు చేసుకోవటం.. తెలంగాణ అధికాపార్టీలో చేరేందుకు సిద్ధం కావటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

దీంతో.. మీడియా ప్రతినిధులు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉత్సాహం ప్రదర్శించారు. తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో పార్టీ మారిన వారిని చూసిన డీఎస్‌.. అలా చేసిన ప్రతిఒక్కరిని తీవ్రంగా విమర్శించేవారు. స్వలాభం కోసం.. ఇలాంటి పనులు చేస్తారని ధ్వజమెత్తేవారు.

అలా విరుచుకుపడే మాటల్ని డీఎస్‌కు తాజాగా గుర్తు చేసిన మీడియా ప్రతినిధులు మరి.. మీ సంగతేంటి? ఏ స్వార్థం కోసం కాంగ్రెస్‌ను వీడుతున్నారని ప్రశ్నించగాఆయన ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం అలవాటు లేని ఆయన.. తాను పదవుల కోసం పార్టీ మారటం లేదని వ్యాఖ్యానించారు. తనను ఇరికించేందుకే మీడియా ప్రతినిధులు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగారు.

ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా.. కేవలం తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసమే పార్టీ మారుతున్నట్లు అయితే.. తన జీవితకాలంలో ఎలాంటి పదవులు తీసుకోనని.. తనకు అలాంటివి వద్దని విస్పష్టంగా ప్రకటించొచ్చుగా. పదవుల మీద ఆశ ఉన్న విషయాన్ని పబ్లిక్‌గా ఒప్పుకోలేని వ్యక్తి.. మీడియా ప్రతినిధుల మీద ఎదురుదాడికి దిగటం ఎంతవరకు సబబు..?