Begin typing your search above and press return to search.

డీఎస్‌ కూడా బీటీ బ్యాచే!!

By:  Tupaki Desk   |   2 July 2015 11:30 AM GMT
డీఎస్‌ కూడా బీటీ బ్యాచే!!
X
టీఆర్‌ఎస్‌లో చేరిన ధర్మపురి శ్రీనివాస్‌ కూడా తనకు తాను బీటీ బ్యాచ్‌.. అంటే బంగారు తెలంగాణ బ్యాచ్‌ అని చెప్పుకొన్నారు. కేసీఆర్‌ నిర్మించే బంగారు తెలంగాణ కోసం తాను ఒక సమిథను కావడానికే కారెక్కానని సోనియా గాంధీకి రాసిన లేఖలో ఆయన చెప్పుకొన్నారు. అయితే, ఆ లేఖలో ఆయన రాసిన కొన్ని అంశాలపై కాంగ్రెస్‌ నాయకులు తప్పుపడుతున్నారు.

తెలంగాణను ఏర్పాటు చేయడంలో సోనియా జాప్యం చేశారని, అందుకే పార్టీ ఓడిపోయిందని డీఎస్‌ చెబుతున్నారు. మరి, ఇదే విషయాన్ని ఆయన కాంగ్రెస్‌ హయాంలో వైఎస్‌ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదని ఆ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ స్వయంకృతాపరాథం వల్లనే అధికారంలోకి రాలేదని డీఎస్‌ అంటున్నారని, అందులో ఆయన పాపం ఎంతని నిలదీస్తున్నారు.

తెలంగాణను విజయతీరానికి చేర్చిన ఘనత .. చరిత్రలో నిలిచే ఘనత కేసీఆర్‌ది అయితే సోనియా ఘనత ఏమిటని ప్రశ్నిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నంత మాత్రాన సోనియా ఘనతను తక్కువ చేయడం నైతికమేనా అని నిలదీస్తున్నారు.

హైదరాబాద్‌ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగడం.. పోలవరం ముంపు మండలాలు.. ఉద్యోగుల విభజన, హైకోర్టు ఇప్పుడే డీఎస్‌కు గుర్తుకు వచ్చాయా అని నిలదీస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు, వచ్చిన తర్వాత ఈ ఏడాదిలో ఎందుకు మాట్లాడలేదని నిలదీస్తున్నారు.

సెక్షన్‌ 8ని పెట్టినప్పుడు ఢిల్లీకి చర్చలకు వెళ్లిన విషయం డీఎస్‌కు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.

సోనియా గాంధీకి లేఖ రాసే సమయానికే ఆయన టీఆర్‌ఎస్‌ కార్యకర్త అయిపోయాడని, అందుకే ఆంధ్రా పాలకుల మీద కూడా టీఆర్‌ఎస్‌ నాయకుడి తరహాలో విరుచుకుపడ్డారని వివరిస్తున్నారు. ఆయన లేఖ అంతా అబద్ధాలమయమని, ఆత్మవంచనని కాంగ్రెస్‌ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు.