Begin typing your search above and press return to search.

క‌విత‌ కార‌ణంగానే ఆ ఎంపీ అప్‌ సెట్ ?

By:  Tupaki Desk   |   3 Aug 2017 6:08 AM GMT
క‌విత‌ కార‌ణంగానే ఆ ఎంపీ అప్‌ సెట్ ?
X
కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌గా గుర్తింపు పొంది ఒక ద‌శ‌లో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా కూడా ప్ర‌చారం అయిన ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్‌ కు టీఆర్ ఎస్‌ లో ఇబ్బందిక‌ర‌మైన వాతావార‌ణం ఎదుర‌వుతోందా? పార్టీతో ఆయ‌న అంటీముట్ట‌నట్లు ఉండ‌టానికి టీఆర్ ఎస్ ఎంపీ క‌విత కార‌ణ‌మా? సీనియ‌ర్ అయిన‌ప్ప‌టికీ త‌న‌కు గౌర‌వం ద‌క్క‌డం లేద‌నే భావ‌న‌లో డీఎస్ ఉన్నారా....ఇవ‌న్నీ ఇప్పుడు తెలంగాణ‌లోని రాజ‌కీయవ‌ర్గాల్లో జోరుగా వినిపిస్తున్న చ‌ర్చోప‌చ‌ర్చ‌లు, సందేహాల సారాంశం.

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌గా ఉన్న డీఎస్ గులాబీ పార్టీలో చేరిన స‌మ‌యంలోనే ఆయ‌న‌కు స‌ల‌హాదారు ప‌దవిని సీఎం కేసీఆర్ క‌ట్ట‌బెట్టారు. ఆ త‌దుప‌రి రాజ్య‌స‌భ చాన్స్ కూడా ఇప్పించారు. రాజ్యసభలో టీఆర్‌ ఎస్‌ ఎంపీగా కొనసాగుతున్నా, ఖాళీ సమయాల్లో ఎక్కువసేపు కాంగ్రెస్‌ పార్టీ పెద్దలతోనే మాట్లాడుతున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. రాష్ట్రపతిగా కోవింద్‌ ఎన్నికైన తర్వాత సీఎం కేసీఆర్‌ తన పార్టీ ఎంపీలతో కలిసి గ్రూపు ఫొటో దిగారు. దీనికి డీఎస్‌ హాజరుకాకపోవడం పలు అనుమానాలకు దారి తీసినట్లయింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రతిరోజూ ఏదో ఒక అంశంపై స్పందిస్తూనే ఉండేవారు. పార్టీ నాయకత్వంపైనా, ప్రభుత్వంపైనా ప్రతిపక్షాలు విమర్శలు చేసినా ఖండించేవారు. కానీ ప్ర‌స్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పైనా - టీఆర్‌ ఎస్‌ పార్టీపైనా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా మౌనంగానే ఉండిపోతున్నారు త‌ప్ప మాట్లాడటం లేదు. స‌ర్కారుకు ఇర‌కాటంగా మారిన మియాపూర్‌ భూకుంభకోణం కేసు విష‌యంలో అంటీముట్టనట్లుగానే ఉన్నారని అంటున్నారు.

నిజామాబాద్ ఎంపీగా సీఎం కేసీఆర్ త‌న‌య కవిత ప్రాతినిధ్యం వ‌హిస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జిల్లాకు చెందిన డీఎస్‌ కు అనుకున్నంత‌గా గౌర‌వం ద‌క్క‌డం లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే పెద్దరికానికి విలువ ఉండడం లేదని సన్నిహితుల వద్ద కూడా డీఎస్ వ్యాఖ్యినిస్తున్న‌ట్లు స‌మాచారం. అందుకే అంటీముట్ట‌న‌ట్లుగా ఉంటున్నార‌ని చెప్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలకరించినప్పుడో, ఆయనతో ప్రత్యేకంగా పని ఉన్న సందర్భంలోనే డీఎస్‌ మాట్లాడుతున్నారని సమాచారం. అయితే అలాంటి పొరాపొచ్చాలేమీ లేవ‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు అంటున్నాయి. మిగతా టీఆర్‌ ఎస్‌ నేతలతో ఆయనకు ప్రత్యేకంగా సంబంధాలు లేకపోవడం వ‌ల్ల, పెద్ద‌రికం కార‌ణంగా విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రైన‌ది కాద‌ని భావించ‌డం వ‌ల్ల డీఎస్ దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని చెప్తున్నారు.