Begin typing your search above and press return to search.

రాహుల్‌ ను క‌లిసినా డీఎస్‌ కు ఎందుకీ ప‌రాభావం?

By:  Tupaki Desk   |   6 Nov 2018 5:44 PM GMT
రాహుల్‌ ను క‌లిసినా డీఎస్‌ కు ఎందుకీ ప‌రాభావం?
X
నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం..ఉమ్మ‌డి రాష్ట్రంలో కీల‌క‌మైన ద‌శ‌లో పీసీసీ చీఫ్‌ గా సార‌థ్యం - తెలంగాణ‌లో బ‌ల‌మైన నేత‌గా పేరు...కీల‌క‌మైన సామాజిక‌వ‌ర్గంలో ముఖ్య‌మైన నేత‌గా గుర్తింపు పొందిన డీఎస్ రాజ‌కీయ భ‌వితవ్యం డైలామ‌ లో ప‌డిందా? కాంగ్రెస్ పార్టీలో డీ.శ్రీనివాస్ పునరాగమనం చేసే విషయంలో ఎందుకు ఇంకా అస్ప‌ష్ట‌త ఉంది? ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో డీఎస్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నప్పటికీ - కాంగ్రెస్‌ లో ఆయన చేరికకు సంబంధించి మాత్రం ఎలాంటి స్పష్టత రాలేకపోవ‌డం వెనుక ఏం జ‌రుగుతోంది? ఇది రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది.

గత ఆరు మాసాల క్రితమే డీఎస్ కాంగ్రెస్ పెద్దలను కలిశారనే ప్రధాన ఆరోపణ మేరకే ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేస్తూ ఉమ్మడి జిల్లాకు చెందిన తెరాస ఎమ్మెల్యేలు - ఎంపీలంతా అధినేతకు ఫిర్యాదు లేఖ పంపారు. దాదాపు నాలుగు నెలల పాటు వేచిచూసిన డీఎస్ - చివరకు అధిష్టానంపై తన అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కారు. ఫిర్యాదు లేఖను అనుసరిస్తూ తాను తప్పు చేశానని భావిస్తే తనపై చర్యలు తీసుకోవాలని - లేని పక్షంలో లేఖను ఉపసంహరింప జేసి తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పత్రికా ముఖంగా డిమాండ్ చేశారు. దీనిపైనా తెరాస అధినేత నుండి స్పందన రాకపోవడంతో డీఎస్ తన అనుచరుల ఒత్తిడి మేరకు వారిని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో డీఎస్ కూడా కాంగ్రెస్ గూటికి తిరిగి వస్తారని అంతా భావించినా - ఆయన వేచి చూసే ధోరణినే అవలంభిస్తుండడం పట్ల పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

ఇటీవలే ఆయన అనుచరులంతా టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తనకు గట్టి పట్టు ఉన్న నిజామాబాద్ అర్బన్ - రూరల్ నియోజకవర్గాలకు చెందిన సుమారు 4వేల మంది క్రియాశీలక కార్యకర్తలు డీఎస్‌ తో పలుమార్లు సమాలోచనలు జరిపిన మీదట కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే - డీఎస్ చేరిక ఖ‌రారు కాలేదు. డీఎస్ తనంతటతాను తెరాసకు రాజీనామా చేసి కాంగ్రెస్‌ లో చేరితే రాజ్యసభ పదవిని కోల్పోయే అవకాశం ఉండడం వల్లే తాత్సారం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ హై కమాండ్ నుండి డీఎస్ కోరుకుంటున్న అంశాలపై పూర్తిస్థాయిలో హామీ లభించని కారణంగానే ఆయన తన పునరాగమనంపై పరిపరివిధాలుగా ఆలోచనలు చేస్తుండవచ్చని పరిశీలకులు పేర్కొంటున్నారు.