Begin typing your search above and press return to search.

అబ్బే..కేసీఆర్‌ కు నాకు ఆ గ్యాప్ లేదంటున్న ఎంపీ

By:  Tupaki Desk   |   4 Aug 2017 6:23 AM GMT
అబ్బే..కేసీఆర్‌ కు నాకు ఆ గ్యాప్ లేదంటున్న ఎంపీ
X
టీఆర్‌ ఎస్ అధ్యక్షుడు - సీఎం కేసీఆర్‌ తో పొస‌గ‌క‌పోవ‌డం వ‌ల్ల రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పి మళ్ళీ కాంగ్రెస్‌ లోకి వెళ్తున్నట్లు జోరుగా ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. దీనికి డీఎస్ క్లారిటీ ఇచ్చారు. తాను టీఆర్‌ ఎస్‌ ను వీడ‌టం లేద‌న్నారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు, వార్తలు కట్టుకథలేనని స్పష్టంచేశారు. జవాబుదారీతనం లేని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించవద్దని తొలుత భావించానని, కానీ వాటి ఆధారంగా కొన్ని పత్రికల్లో కూడా వార్తలు రావడంతో స్పష్టత ఇవ్వాల్సి వస్తున్నదని తెలిపారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోనియాగాంధీతో సంప్రదింపులు జరిపినట్టు, మళ్లీ కాంగ్రెస్‌ లోకి వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నట్టు తనను టార్గెట్ చేస్తూ వచ్చిన వార్తలన్నీ పచ్చి అబద్ధాలని అన్నారు.

తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్‌ ఎస్‌ లో చేరానని, ప్రస్తుతం చాలా సంతృప్తిగా ఉన్నానని, మళ్ళీ కాంగ్రెస్‌ లోకి వెళ్ళాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని డీఎస్‌ స్పష్టంచేశారు. కార్యకర్తలు, నాయకులు ఇతర పార్టీలలోకి వెళ్ళకుండా ఎదురుదాడి తరహాలో కాంగ్రెస్ ఇలాంటి ప్రచారం చేస్తుందనే సందేహం లేకపోలేదని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందువల్లనే ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ ను కాంగ్రెస్ విమర్శిస్తున్నదని, తనపై దుష్ప్రచారం కూడా ఇలాంటి రాజకీయ క్రీడలో భాగం కావచ్చునని చెప్పారు. కేసీఆర్ తో తనకు ఎలాంటి విభేదాలు లేకపోగా.. తన హోదాను గుర్తించి తగిన గౌరవంతో రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారని, టీఆర్‌ ఎస్‌ లో పూర్తి సంతృప్తిగా ఉన్నానని అన్నారు.

కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేయడంలో సీఎం కేసీఆర్ చాలా దూరదృష్టితో ఆలోచించి పథకాలు అమలుచేస్తున్నారని, ఆయన కృషికి తన వంతు పాత్రను పోషిస్తున్నానని డీఎస్‌ చెప్పారు. ఇకపైన కూడా ఇది కొనసాగుతుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆ పార్టీలో ఉన్నప్పుడే వ్యాఖ్యానించానని, ఇప్పుడు ఆ పార్టీని వీడిన తర్వాత దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు.