Begin typing your search above and press return to search.

అబ్బే.. నేను టీఆర్ ఎస్‌ ను వీడేది లేదు

By:  Tupaki Desk   |   12 March 2018 6:49 AM GMT
అబ్బే.. నేను టీఆర్ ఎస్‌ ను వీడేది లేదు
X
అధికార టీఆర్ ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ....ఎంపీ డీ శ్రీనివాస్ ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నార‌నే వార్త‌లు రాజ‌కీయంగా క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవల జరిగిన ముఖ్యమైన కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్నారని, ఇదే పార్టీ మారేందుకు సిగ్న‌ల్ అని అంచ‌నాలు వెలువ‌డ్డాయి. టీఆర్‌ ఎస్‌ ఎంపీలతో కేసీఆర్‌ నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరు కాలేదని - జాతీయ స్థాయిలో మూడవ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన సమావేశంలో కూడా ఆయన పాల్గొనలేదని గుర్తు చేశారు.. రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ఎంపీలు చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి కూడా ఆయన దూరంగా ఉన్నారని పేర్కొంటూ తృతీయ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపే అధికారాన్ని మరో సీనియర్‌ నేత కేకేకు కట్టబెట్టడం వ‌ల్ల కేసీఆర్‌కు- డీఎస్‌కు మధ్య అగాధం పెరిగిందని అంచ‌నాలు వెలువ‌డ్డాయి. ఈ నేప‌థ్యంలోనే ధర్మపురి శ్రీనివాస్‌ కు కాంగ్రెస్‌ గాలం వేసి సంప్రదింపులు పూర్తి చేశార‌ని త్వ‌ర‌లోనే ఆయ‌న పార్టీ మార‌నున్నాయ‌నే వార్త‌లు వైరల్ అయ్యాయి.

ఈ నేప‌థ్యంలో డీఎస్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ త‌ను కాంగ్రెస్ పార్టీలో చేర‌డం లేద‌ని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకు ఆయన ఆంతరంగికుడైన ఒక సీనియర్‌ నేత త‌న‌తో చ‌ర్చించార‌నే దాంట్లో నిజం లేద‌న్నారు. ఆ పార్టీ నేతలెవరూ తనను సంప్రదించలేదని - ఒకవేళ పిలిచినా వెళ్లే చాన్సే లేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం తాను ఎంతో చేశాన‌ని అయిన‌ప్ప‌టికీ త‌న‌కు ఆ పార్టీలో అవ‌మానం జ‌రిగింద‌ని ఆరోపించారు. టీఆర్ ఎస్‌ లో తాను కంఫ‌ర్ట్‌గానే ఉన్నాన‌ని వెల్ల‌డించారు. కేవ‌లం గిట్ట‌ని వ‌ర్గాల ప్ర‌చారమే ఇది అని మండిప‌డ్డారు.

దేశానికి మూడో కూటమి అవసరం చాలా ఉందని, అది అధికారంలోకి వచ్చినప్పుడే రాష్ట్రాలకు హక్కులు దక్కుతాయని డీఎస్ తెలిపారు. ఇన్నాళ్లు పరిపాలించిన కాంగ్రెస్ - బీజేపీలు దేశానికి చేసింది ఏమీ లేదని ఆయ‌న వ్యాఖ్యానించారు. రైతులు సహా అన్ని వర్గాలవారికి ఫలాలు అందాలంటే కేసీఆర్ నేతృత్వంలో ఏర్పడే మూడోఫ్రంట్ వల్లనే సాధ్యమవుతుందని చెప్పారు. పలు రాష్ట్రాల్లో ఎస్సీ - బీసీలు - మైనార్టీల సంఖ్య పలురకాలుగా ఉన్నదని, అందుకే రిజర్వేషన్ల అంశం రాష్ట్రాలకే వదిలేయాలని సూచించారు. తెలంగాణతోపాటు - హర్యానా - పంజాబ్ - మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు రిజర్వేషన్లపై పోరాటం చేస్తున్నాయని చెప్పారు.