Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫ్యామిలీకి డీఎస్ దెబ్బ త‌ప్ప‌దా?

By:  Tupaki Desk   |   31 Aug 2017 10:34 AM GMT
కేసీఆర్ ఫ్యామిలీకి డీఎస్ దెబ్బ త‌ప్ప‌దా?
X
తెలంగాణ‌లో ఆస‌క్తిక‌ర రాజ‌కీయ విష‌యాలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. సీనియ‌ర్ పొలిటిక‌ల్ నేత - కాంగ్రెస్‌ లో గ‌తంలో చ‌క్రం తిప్పిన ధ‌ర్మ‌పురి శ్రీనివాస్ ఉర‌ఫ్ డీఎస్ కేంద్రంగా ప‌లు విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. రాష్ట్ర విభ‌జ‌న‌తో ఆయ‌న కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ గూటికి చేరిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న‌కు నెల నెలా ల‌క్ష రూపాయ‌లు జీతంతో పాటు స‌ర్కారీ కారు - కేబినెట్ హోదా త‌దిత‌ర సౌక‌ర్యాలు ఇచ్చి.. స‌ల‌హాదారుగా నియ‌మించుకున్నాడు సీఎం కేసీఆర్‌. అయితే, ఆయ‌న దీంతో సంతృప్తి చెంద‌లేద‌ని - క్రియాశీల రాజ‌కీయాలకు త‌న‌ను దూరం చేస్తున్నార‌నే ఆవేద‌న‌తో ఉన్నార‌ని, రేపో మాపో కాంగ్రెస్ లోకి వ‌స్తార‌ని నిన్న‌టిదాకా ప్ర‌చారం జ‌రిగింది.

ఇక‌, ఇప్పుడు ఆయ‌న కుమారుడు ధ‌ర్మ‌పురి అర‌వింద్‌.. కేంద్రంగా మ‌రో రాజ‌కీయ వ్యాఖ్య‌లు కొన‌సాగుతున్నాయి. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న బీజేపీకి... ప్ర‌త్యేకించి ప్ర‌ధాని మోదీకి ద‌గ్గ‌ర‌వుతున్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌. మోదీని బలపరుస్తూ ఇప్ప‌టికే ఆయ‌న అనేక పోస్ట‌ర్లు కూడా ప్రింట్ చేయించారు. ఇక‌, సోష‌ల్ మీడియాలో అయితే, మోదీకి ప్ర‌త్య‌క్షంగా మ‌ద్ద‌తే ఇస్తున్నారు. దీంతో త్వ‌ర‌లోనే డీఎస్ కుటుంబం క‌మ‌ల ద‌ళంలో చేర‌నుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా త‌న కుమారుడికి రాజ‌కీయంగా ఎంట్రీ ఇవ్వాల‌ని డీఎస్ ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నార‌ని, అయితే, వీలు ప‌డ‌డం లేద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో విస్త‌రించాల‌ని చూస్తున్న బీజేపీలోకి జంప్ చేస్తే.. త‌న‌కు, త‌న కుమారుడికి కూడా మంచి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని డీఎస్ ప్లాన్ చేశార‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ముందు త‌న కొడుకును ఉసిగొలిపార‌ని, అందుకే ఆయ‌న రెచ్చిపోయి మ‌రీ బీజేపీకి మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి. అరవింద్ పోస్టు చూసిన తర్వాత ఆయన కుటుంబమంతా బీజేపీలో చేరుతుందని అంటున్నారు. అయితే, తాను పార్టీ మారడం లేదని డీఎస్ స్పష్టం చేశారు.

తాను కేసీఆర్‌ తోనే కొనసాగుతానని ఆయన చెప్పారు. అయిత, అరవింద్ మాత్రం బీజేపీలో చేరి నిజామాబాద్ పార్లమెంటు సీటుకు పోటీ చేస్తారని ఊహాగానాలు బ‌ల‌ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఆయ‌న ఢిల్లీలోని బీజేపీ పెద్ద‌ల‌తో సైతం రాయ‌బారం న‌డిపార‌ని, సెప్టెంబర్‌ లో క‌మ‌ల తీర్థం పుచ్చుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం నిజామాబాద్ ఎంపీగా టీఆర్ ఎస్ అధినేత‌ - సీఎం కేసీఆర్ కూతురు క‌విత ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆమె ఇక్క‌డ నుంచి పోటీ చేస్తే.. అర‌వింద్ ఆమెకు గ‌ట్టి పోటీ ఇవ్వాల‌ని, ఢీకొట్టి మ‌రీ గెల‌వాల‌ని ప్లాన్ చేసుకున్న‌ట్టు చెబుతున్నారు. అయితే, ఇది ఎంత వ‌ర‌కు సాధ్యం? అస‌లు తాజా వార్త‌ల్లో నిజ‌మెంత‌? డీఎస్ పొలిటిక‌ల్ గేమ్ ఆడుతున్నారా? కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు? వ‌ంటివి మాత్రం ఇప్పుడిప్పుడే చెప్ప‌లేం. వెయిట్ చేయాల్సిందే.