Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు డీఎస్ షాకిస్తారా?

By:  Tupaki Desk   |   11 Aug 2017 10:58 AM GMT
కేసీఆర్ కు డీఎస్ షాకిస్తారా?
X
డీఎస్‌... తెలుగు నేల రాజ‌కీయాల్లో ఈ పేరుకు ఏమాత్రం ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ధ‌ర్మ‌పురి శ్రీనివాస్‌ గా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన డీఎస్‌... గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ లో సుదీర్ఘ కాలం పాటు కొన‌సాగారు. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో మంత్రిగా - పీసీసీ చీఫ్‌గా డీఎస్ నెర‌పిన మంత్రాంగం మ‌నం ఇప్ప‌టికీ మ‌రిచిపోలేనిదే. తెలుగు నేల రెండుగా విడిపోయి కొత్త‌గా తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా అవ‌త‌రించిన త‌ర్వాత రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి ఎదురు దెబ్బే త‌గిలింది. ఈ క్ర‌మంలో న‌వ్యాంధ్ర‌లో ఆ పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోగా... తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నా కూడా తెలంగాణ‌లో ఆ పార్టీకి పెద్ద‌గా ఒరిగిందేమీ లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలో ఆ పార్టీకి చెందిన చాలా మంది నేత‌లు త‌మ త‌మ దారులు చూసుకున్నారు. న‌వ్యాంధ్ర‌లో ఒక్క ర‌ఘువీరా మిన‌హా చాలా మంది నేత‌లు అటు టీడీపీలోనే, ఇటు వైసీపీలోనో చేరిపోయారు. ఇక ఏ పార్టీలో చేర‌కుండా కాంగ్రెస్‌ నే అంటిపెట్టుకుని ఉన్న సీనియ‌ర్లు... కాలం బాగా లేదంటూ బ‌య‌ట‌కే రాలేని పరిస్థితి. ఇక తెలంగాణ‌లోనూ అదే ప‌రిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన డీఎస్‌... త‌ద‌నంత‌ర కాలంలో తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ ఎస్‌ లో చేరిపోయారు. నాటి ఒప్పందం మేర‌కు డీఎస్‌ కు ప్ర‌త్యేక ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ద‌వి ఇచ్చిన కేసీఆర్‌... ఆయ‌న‌కు కేబినెట్ హోదా కూడా క‌ల్పించారు. ఆ త‌ర్వాత రాజ్య‌స‌భ‌కు కూడా పంపారు.

కేవ‌లం ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ద‌వి - రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం మాత్ర‌మే డీఎస్ లాంటి నేత‌ల‌కు ఏం స‌రిపోతుంది చెప్పండి. ఇదే భావ‌న‌తో ఉన్న డీఎస్‌... రానున్న ఎన్నిక‌ల్లో త‌న‌కు కావాల్సిన అంశాల‌కు సంబంధించిన డిమాండ్ల‌ను కేసీఆర్ ముంద‌ట పెట్టార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నిజామాబాదు అర్బ‌న్ టికెట్‌ ను త‌న కుమారుడికి ఇవ్వాల‌ని కేసీఆర్‌ కు డీఎస్ విన్న‌వించార‌ట‌. అయితే చూద్దాం... చేద్దాం అంటూ కేసీఆర్ నాన్చుతున్న వైనంపై కాస్తంత అసంతృప్తిగా ఉన్న డీఎస్‌... ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ‌... త‌న అసంతృప్త గ‌ళాన్ని మ‌రింత‌గా వినిపించార‌ట‌. అయినా కూడా కేసీఆర్ పెద్ద‌గా స్పందించ‌క‌పోవ‌డంతో ఇక టీఆర్ ఎస్‌ కు గుడ్ బై చెప్పేందుకే డీఎస్ నిర్ణ‌యించుకున్న‌ట్లుగా క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.

టీఆర్ ఎస్‌ లో ఉన్నా కూడా డీఎస్ కాంగ్రెస్ అధిష్ఠానంతో ట‌చ్ లోనే ఉంటున్నార‌ట‌. ఎందుకంటే... కాంగ్రెస్‌లో కీల‌క నేత‌గా ఉన్న డీఎస్‌... నాడు అధిష్ఠానంతో అత్యంత స‌న్నిహితంగా మెల‌గిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. నాటి సంబంధాల‌ను ఇంకా కొన‌సాగిస్తున్న డీఎస్‌ లో అసంతృప్తిని గ‌మ‌నించిన కాంగ్రెస్ పార్టీ ఆయ‌న‌ను తిరిగి పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అతి త్వ‌ర‌లోనే డీఎస్ త‌న సొంత గూటికి చేరిపోవ‌డం ఖాయ‌మేన‌ని కూడా కొన్ని వ‌ర్గాల నుంచి వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే జ‌రిగితే... ఆప‌రేష‌న్ ఆకర్ష్ పేరిట తెలంగాణ‌లో విప‌క్షాల‌ను పెద్ద దెబ్బ కొట్టిన టీఆర్ ఎస్‌ కు గ‌ట్టి షాక్ త‌గిలిన‌ట్లేన‌న్న వాద‌న వినిపిస్తోంది.