Begin typing your search above and press return to search.

సొంత గూటికి చేరేందుకు డీఎస్ స‌న్నాహాలు

By:  Tupaki Desk   |   17 Oct 2017 7:20 AM GMT
సొంత గూటికి చేరేందుకు డీఎస్ స‌న్నాహాలు
X
ఉమ్మ‌డి రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక అయిన పీసీసీ చీఫ్ గా పనిచేసి...తెలంగాణ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి - ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యుడు డి.శ్రీ‌నివాస్ అధికార పార్టీలో ఇమ‌డ‌లేక‌పోతున్నారా? ఎమ్మెల్యేలు - ప్రజా ప్రతినిధులు - అధికారులు తనను పట్టించుకోవడం లేదన్న ఆవేదనలో డీఎస్ ఉన్నారా? త‌్వ‌ర‌లో ఆయ‌న సొంత గూడు అయిన కాంగ్రెస్‌లో చేర‌నున్నారా? అంటే అవున‌నే అంటున్నారు టీఆర్ ఎస్ పార్టీలోని కొంద‌రు నేత‌లు. పీసీసీ మాజీ చీఫ్ అయిన డీఎస్ టీఆర్ ఎస్ లో చేరి చక్రం తిప్పాలనుకున్నారు. ఆయనకు ఎంపీ పదవయితే వచ్చింది కానీ పార్టీలో మాత్రం అనుకున్న ప్రాధాన్యత ద‌క్క‌డం లేదంటున్నారు. ఏదో పార్టీలో ఉన్నారా అంటే ఉన్నారు అన్న చందంగా ఆయన పరిస్థితి తయారైంది. దీనికి కార‌ణం....ఈ మధ్య ఆయన తనయుడు అరవింద్ బీజేపీలో చేరడం.

అరవింద్ బీజేపీలో చేరడంతో డీఎస్ పరపతి టీఆర్ ఎస్‌ పార్టీలో మరింతగా పలుచనైపోయిందని టాక్ వినిపిస్తోంది. సొంత కొడుకునే నిలువరించలేని డీఎస్ వల్ల పార్టీకి ఏం లాభమన్న అభిప్రాయం గులాబీ పార్టీలో నెలకొంది. టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని - కేసీఆర్ కుటుంబాన్ని నిత్యం విమర్శించే కమలం గూటికి డీఎస్ తనయుడు చేరడాన్ని టీఆర్ ఎస్ సీనియర్లు తప్పుపుడుతున్నారని స‌మాచారం. డీఎస్ ఆదేశాల మేరకే అరవింద్ పార్టీ మారినట్లు ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయం చేసుకునేందుకు డీఎస్ పావులు కదుపుతున్నారనే అనుమానాలు కూడా వెలువడ్డాయి. దీంతో డీఎస్ ను టీఆర్ ఎస్ అధిష్టానం అనుమానిస్తోందన్న వ్యాఖ్యానాలు జోరుగా వినిపిస్తున్నాయి. మ‌రోవైపు డీఎస్ ఇలాకా అయిన నిజమాబాద్‌ లో ఎంపీ కవిత - సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఎమ్మెల్యేలు - ప్రజా ప్రతినిధులు - అధికారులు ముందుకు సాగుతున్నారే త‌ప్ప‌ తనను పట్టించుకోవడం లేదన్న ఆవేదనలో డీఎస్ ఉన్నారని అంటున్నారు. ఓ వెలుగు వెలిగిన తనకు విలువ లేకుండా చేస్తున్నారని సన్నిహితుల వద్ద కుమిలిపోతున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది.

కాంగ్రెస్‌ లో ఉన్న స‌మ‌యంలో పీసీసీ చీఫ్ గా పనిచేసిన డీఎస్...టీఆర్ ఎస్ లో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నప్ప‌టికీ హోదాకు - సీనియారిటీకి తగిన పని లేకపోవడంతో చాలా అసంతృప్తిగా ఉండ‌టంతో ఆయన టీఆర్ ఎస్ వీడడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం - సీనియ‌ర్‌ గా ఉన్న నాయ‌కుడికి మళ్లీ కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే అవకాశాలపై కాంగ్రెస్ లో చర్చ జరుగుతోందని స‌మాచారం. డీఎస్ దృష్టికి సైతం ఈ ప్ర‌తిపాద‌న వెళ్లిన‌ట్లు చెప్తున్నారు.